కార్తీక మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమిని కార్తీక పౌర్ణమిగా జరుపుకుంటారు. హిందూ సంప్రదాయంలో ఈ మాసం శివుడు, విష్ణుమూర్తి ఆరాధనకు ప్రత్యేకమైనదిగా భావిస్తారు. పౌర్ణమి రోజున పూజలు, దీపారాధన, దానధర్మాలు చేయడం శుభప్రదమని పురాణ విశ్వాసం.
365 వత్తులతో దీపారాధన సంప్రదాయం
కార్తీక పౌర్ణమి తెల్లవారుజామున స్నానం చేసి, సూర్యోదయానికి ముందే శివుడికి పూజలు చేయడం ఆచారంగా చెబుతారు. అనంతరం తులసి లేదా ఉసిరి చెట్టు వద్ద దీపాలు వెలిగిస్తారు. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో సాధారణ దీపాలు, ఉసిరి దీపాలు వెలిగించే సంప్రదాయం కూడా ఉంది.
ఏడాది పొడవునా దీపారాధన చేయలేని వారు పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపం వెలిగిస్తే సరిపోతుందని పురాణ విశ్వాసం. ఇళ్లలో, ఆలయాల్లో, తులసికోటల వద్ద దీపాలు వెలిగిస్తారు. శివుడికి అభిషేకం, బిల్వార్చన చేసి పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తారు. విష్ణుమూర్తిని ఆరాధించడం, విష్ణు సహస్రనామం లేదా అష్టోత్తరం పారాయణం చేయడమూ ఈ మాసపు ఆచారాల్లో భాగంగా పేర్కొంటారు.
త్రిపుర పౌర్ణమి అనే పేరు వెనుక పురాణ గాథ
పురాణ గాథ ప్రకారం, త్రిపురాసురుల బాధల నుంచి రక్షించమని దేవతలు శివుడిని ప్రార్థించగా, ఆయన త్రిపురాంతక రూపంలో వారిని సంహరించాడు. ఈ కథతో కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈ రోజు వెలిగించే దీపాలను అజ్ఞానంపై జ్ఞానం, చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా భావిస్తారు.
శివుడికి సమర్పించే నైవేద్యాలు
కార్తీక మాసంలో శివుడికి పరమాన్నం, చలిమిడి, పులిహోర సమర్పించే సంప్రదాయం ఉంది. పరమాన్నాన్ని బియ్యం, పాలు, బెల్లంతో తయారు చేస్తారు. చలిమిడిలో బియ్యప్పిండి, బెల్లం, నెయ్యి, యాలకుల పొడి, కొబ్బరి వాడతారు. పులిహోరను అన్నం, చింతపండు రసం, మసాలా తాలింపుతో తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.

