కర్ణాటకలో ఏనుగుల తరలింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మూడిగెరె కాంగ్రెస్ ఎమ్మెల్యే నయన మోటమ్మ రాజీనామా ప్రకటించారు. సోమవారం విధానసౌధలోని స్పీకర్ కార్యాలయంలో రాజీనామా లేఖ అందజేసిన ఆమె, తన నియోజకవర్గ ప్రజల ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
ఏనుగుల తరలింపుపై అభ్యంతరం
హాసన్ జిల్లా బేలూరు తాలూకా అడవుల్లో ఉన్న ఏనుగుల గుంపును మూడిగెరె పరిధిలోని భద్రా రిజర్వు అటవీ ప్రాంతానికి తరలించడంపై నయన అభ్యంతరం తెలిపారు. చిక్కమగళూరు జిల్లా ఎమ్మెల్యేలతో చర్చించకుండానే, తనకూ సమాచారం ఇవ్వకుండానే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆమె ఆరోపించారు.
గతంలో బేలూరులో అడవి ఏనుగుల దాడిలో ఇద్దరు మరణించిన తర్వాత, ఏనుగులను పొరుగు జిల్లాకు తరలించే ఏర్పాట్లు జరిగాయని ఆమె లేఖలో వివరించారు. స్థానికుల ఆందోళనల నేపథ్యంలో భద్రా అభయారణ్యంలోకి ఏనుగులను విడుదల చేయడం తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు.
పంటలు, కాఫీ తోటలకు నష్టం కలుగుతుందన్న ఆందోళన
వన్యప్రాణుల దాడులతో మూడిగెరె ప్రజలు ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నయన అన్నారు. ఏనుగులు, దున్నపోతుల దాడుల్లో ప్రాణనష్టం జరిగిందని పేర్కొంటూ, బయట ప్రాంతాల నుంచి మరిన్ని ఏనుగులను తీసుకురావడం వల్ల పంట పొలాలు, కాఫీ తోటలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం 36 ఏనుగులను మూడిగెరె వైపు తరలిస్తున్నట్లు తనకు తెలిసిందని ఆమె తెలిపారు. తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్ను కోరారు.

