విజయనగరం: ముఖ్యమంత్రి చంద్రబాబుకు కుటుంబాలను విడదీసే చరిత్ర ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. అయితే బొత్స సత్యనారాయణ కుటుంబాన్ని మాత్రం ఎవరూ టచ్ చేయలేరని ఆయన వ్యాఖ్యానించారు. బొత్స సత్యనారాయణను రాజకీయ విశ్వవిద్యాలయంగా అభివర్ణిస్తూ.. ఆయన ఎంతోమందిని సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యేలుగా తీర్చిదిద్దారని ప్రశంసించారు.
విజయనగరం జిల్లాలో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ జిల్లా సర్వసభ్య సమావేశంలో మండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌తో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ పరిస్థితులు, కార్యకర్తల పాత్ర, రాబోయే రాజకీయ పరిణామాలపై నేతలు చర్చించారు.
సమావేశంలో అమర్నాథ్ మాట్లాడుతూ.. విజయనగరం జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ‘బొత్స 2.0’ కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. వైఎస్ జగన్ రాజకీయ పార్టీని కేవలం నాయకులను నమ్మి స్థాపించలేదని, వైఎస్సార్ అభిమానులు, ప్రజలను నమ్మి పార్టీ పెట్టారని పేర్కొన్నారు.
చంద్రబాబుపై విమర్శలు చేస్తూ.. కుటుంబాలను విడదీయడం ఆయన రాజకీయ చరిత్రలో భాగమని అమర్నాథ్ ఆరోపించారు. ఇలాంటి పరిణామాలు ఏ కుటుంబంలోనైనా చోటుచేసుకోవచ్చని, కానీ బొత్స సత్యనారాయణ కుటుంబాన్ని మాత్రం ఎవరూ తాకలేరని అన్నారు.
లోకేష్ చుట్టూ ఐఏఎస్ అధికారులు తిరుగుతున్నారని చంద్రబాబు భావిస్తున్నారని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు గాడిద కూడా గుర్రంలా కనిపిస్తుందని వ్యంగ్యంగా అన్నారు. ప్రస్తుతం లోకేష్ చుట్టూ తిరుగుతున్న అధికారులు.. భవిష్యత్తులో తాము గాడిద చుట్టూ తిరిగామని అనుకునే రోజు వస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బొత్స సత్యనారాయణ ఒక రాజకీయ విశ్వవిద్యాలయం వంటివారని అమర్నాథ్ అన్నారు. ఆయన రాజకీయ అనుభవం, నాయకత్వంలో ఎంతోమంది స్థానిక నాయకులు ఎదిగారని పేర్కొన్నారు. పార్టీకి కష్టకాలం వచ్చినప్పటికీ బొత్స కుటుంబం, ఆయన అనుచరులు వెనక్కి తగ్గరని ధీమా వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో ‘చిన్న శ్రీను’ అంశాన్ని అమర్నాథ్ ప్రస్తావించగా బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కన్నీరు పెట్టుకోవడం సమావేశంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు, అమర్నాథ్ వ్యాఖ్యలు వైఎస్సార్‌సీపీ అనుబంధ సోషల్ మీడియా వర్గాల్లో వైరల్ అవుతున్నాయి.

