యూపీఐ ద్వారా డబ్బులు పంపే వారికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక స్పష్టత ఇచ్చింది. వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే యూపీఐ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు ఉండవని వెల్లడించింది. అయితే వ్యక్తి నుంచి వ్యాపారికి చేసే కొన్ని చెల్లింపులపై మాత్రం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) వర్తించనుంది. ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్నట్లు సమాచారం.
అంటే మీరు మీ స్నేహితుడికి రూ.500, కుటుంబ సభ్యుడికి రూ.5,000 లేదా మరో వ్యక్తికి రూ.1 లక్ష యూపీఐ ద్వారా పంపినా ఎలాంటి ఛార్జీ ఉండదు. లావాదేవీ విలువ ఎంత ఉన్నా P2P (Person to Person) చెల్లింపులు ఉచితంగానే కొనసాగుతాయి.
అయితే P2M (Person to Merchant) లావాదేవీల విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఒక షాపులో రూ.5,000 విలువైన వస్తువులు కొనుగోలు చేసి యూపీఐ ద్వారా చెల్లిస్తే అది P2M లావాదేవీగా పరిగణిస్తారు.
ఇలాంటి సందర్భాల్లో రూ.2,000 కంటే ఎక్కువ విలువైన P2M లావాదేవీలపై 0.4 శాతం MDR ఛార్జీ వర్తించనుందని పేర్కొన్నారు.
ఇక అధిక మొత్తంలో జరిగే లావాదేవీలకు సంబంధించి కూడా పరిమితి ఉండనుంది. రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీలపై MDR గరిష్ఠంగా రూ.300కు పరిమితం చేయనున్నట్లు సమాచారం.
ఉదాహరణకు రూ.1 లక్ష విలువైన P2M లావాదేవీ జరిగితే 0.4 శాతం ప్రకారం రూ.400 MDR రావాల్సి ఉంటుంది. అయితే గరిష్ఠ పరిమితి రూ.300గా ఉండటంతో MDR రూ.300కే పరిమితం అవుతుంది.
అందువల్ల యూపీఐ వినియోగదారులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే.. వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే చెల్లింపులపై ఛార్జీ ఉండదు. అయితే వ్యక్తి నుంచి వ్యాపారికి చేసే రూ.2,000 కంటే ఎక్కువ విలువైన చెల్లింపులపై 0.4 శాతం MDR వర్తిస్తుంది. రూ.75,000 పైబడిన అధిక విలువైన లావాదేవీలకు MDR గరిష్ఠ పరిమితి రూ.300గా ఉంటుంది.

