అమరావతి, సెప్టెంబర్ 11: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారనుంది. దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలపై అల్పపీడనం కేంద్రీకృతమై ఉండటంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.
తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రానున్న మూడు రోజుల పాటు ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత సూచించారు.
వర్షాల కారణంగా ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. వాతావరణ మార్పులు, భారీ వర్షాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక సందేశాలు పంపాలని అధికారులను ఆదేశించారు.
మరోవైపు సముద్రంలో పరిస్థితులు ప్రతికూలంగా మారే అవకాశం ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ప్రభుత్వం సూచించింది. తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సహాయం అందించేందుకు విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నంబర్లను అందుబాటులో ఉంచింది. 112, 1070, 1800 425 0101 నంబర్ల ద్వారా అత్యవసర సహాయం పొందవచ్చని అధికారులు తెలిపారు.
అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజులు కీలకంగా మారనున్న నేపథ్యంలో.. జిల్లాల వారీగా పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఎలాంటి విపత్తు ఎదురైనా వెంటనే స్పందించేలా యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచాలని మంత్రి అనిత ఆదేశించారు.

