అమరావతి, సెప్టెంబర్ 11: ఆంధ్రప్రదేశ్ మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సమావేశం రెండో రోజు సందర్భంగా మంత్రుల ఫైల్స్ క్లియరెన్స్‌పై ర్యాంకులను వెల్లడించారు. ఫైల్స్‌ను వేగంగా క్లియర్ చేయడంలో వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు మొదటి స్థానంలో ఉన్నారని చంద్రబాబు తెలిపారు.
అదే సమయంలో రవాణా శాఖ మంత్రి ఎం. రాంప్రసాద్ రెడ్డి చివరి స్థానంలో ఉన్నారని సీఎం పేర్కొన్నారు. ఫైల్స్ క్లియరెన్స్‌కు ఎక్కువ సమయం తీసుకుంటున్న మంత్రుల్లో రాంప్రసాద్ రెడ్డి, కొల్లు రవీంద్ర, పయ్యావుల కేశవ్ ఉన్నారని చంద్రబాబు వెల్లడించారు.
హోం మంత్రి వంగలపూడి అనిత కూడా తన పనితీరును మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని సీఎం సూచించినట్టు సమాచారం. ఫైల్స్ పెండింగ్‌లో ఉంచకుండా నిర్ణయాలు వేగంగా తీసుకోవాలని కొందరు మంత్రులకు స్పష్టం చేశారు.
అధికారులపైనా చంద్రబాబు అసంతృప్తి
మంత్రులతో పాటు ప్రభుత్వ కార్యదర్శులు, హెచ్‌ఓడీలు, జిల్లా కలెక్టర్లు ఫైల్స్ క్లియర్ చేయడానికి తీసుకుంటున్న సమయంపైనా చంద్రబాబు వివరాలు వెల్లడించారు. చాలా మంది కార్యదర్శులు రెండు రోజుల్లోనే ఫైల్స్ క్లియర్ చేస్తున్నారని, కొందరు హెచ్‌ఓడీలు మాత్రం మూడు రోజులు తీసుకుంటున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
ఫైల్ క్లియరెన్స్‌కు ఎక్కువ సమయం ఎందుకు పడుతోందనే అంశంపై వివరణ తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌ను చంద్రబాబు ఆదేశించారు.
మొత్తంగా, ఈ ర్యాంకింగ్ ద్వారా వేగవంతమైన నిర్ణయాలే లక్ష్యంగా మంత్రులు, అధికారుల పనితీరును మరింత కఠినంగా పర్యవేక్షించనున్న సంకేతాలను సీఎం ఇచ్చారు. ఒకవైపు అచ్చెన్నాయుడికి టాప్ ర్యాంక్ రావడం ఆసక్తికరంగా మారగా.. మరోవైపు చివరి స్థానంలో ఉన్న మంత్రి, ఆలస్యంగా ఫైల్స్ క్లియర్ చేస్తున్న మంత్రులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.

