తూర్పుగోదావరి జిల్లా మండపేట మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్‌గా కోటిపల్లి శ్రావణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 24వ వార్డు నుంచి బీజేపీ కౌన్సిలర్‌గా గెలిచిన ఆమె, ముందుగా కౌన్సిలర్‌గా ప్రమాణం చేసి, అనంతరం వైస్ ఛైర్పర్సన్ బాధ్యతలు స్వీకరించారు.
వైస్ ఛైర్పర్సన్ ఎన్నిక
శ్రావణి పేరును 11వ వార్డు కౌన్సిలర్ కొవ్వాడ అప్పన్నబాబు ప్రతిపాదించగా, 36వ వార్డు కౌన్సిలర్ నామాల చంద్రరావు బలపరిచారు. ఈ పదవికి మరో అభ్యర్థి పోటీలో లేకపోవడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మున్సిపల్ కమిషనర్ ప్రకటించారు.
మెదక్ నుంచి మండపేటకు
శ్రావణి తల్లిదండ్రుల స్వస్థలం తెలంగాణలోని మెదక్ పట్టణం. ఆమె అక్కడే పుట్టి పెరిగి చదువుకున్నారు. 2006లో మండపేటకు చెందిన న్యాయవాది, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ కోటిపల్లి సాయిరామ్‌ను వివాహం చేసుకున్నారు. బీజేపీ మహిళా మోర్చాలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమెకు పార్టీ కౌన్సిలర్‌గా పోటీ చేసే అవకాశం కల్పించింది.
మండపేటలో కొత్త పాలకవర్గం
మున్సిపాలిటీ నూతన ఛైర్మన్‌గా వేగుళ్ల అజయ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కౌన్సిలర్లు బాధ్యతలు చేపట్టారు. టీడీపీకి చెందిన 24 మంది, జనసేనకు చెందిన 10 మంది, బీజేపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు ప్రమాణం చేశారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు శ్రావణిని అభినందించారు.
పట్టణంలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తామని ఛైర్మన్ వేగుళ్ల అజయ్ కుమార్ తెలిపారు.

