ఆంత్రోపిక్‌లో సాంకేతిక విభాగానికి నాయకత్వం
రాహుల్ పాటిల్ ఆంత్రోపిక్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. కంపెనీ ఇంజినీరింగ్, ఉత్పత్తులు, కంప్యూటింగ్, మౌలిక సదుపాయాలు, ఇన్ఫరెన్స్, డేటా సైన్స్, భద్రత వంటి విభాగాలు ఆయన బాధ్యతల్లో ఉంటాయని సంస్థ నియామక ప్రకటనలో తెలిపింది. ఆంత్రోపిక్ క్లాడ్ అనే ఏఐ సహాయక ఉత్పత్తిని అభివృద్ధి చేస్తోంది.
బెంగళూరులో చదువు.. అమెరికాలో ఉన్నత విద్య
పాటిల్ బెంగళూరులోని పీఈఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ చదివారు. అండర్గ్రాడ్యుయేట్ డిగ్రీ తర్వాత అమెరికాకు వెళ్లి అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. అనంతరం యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో ఎంబీఏ పూర్తి చేశారు.
మైక్రోసాఫ్ట్ నుంచి స్ట్రైప్ వరకు
ఆయన కెరీర్ మైక్రోసాఫ్ట్‌లో ప్రారంభమైంది. అక్కడ తొమ్మిదేళ్లపాటు వివిధ ఇంజినీరింగ్ హోదాల్లో పనిచేశారు. 2013లో అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో మేనేజర్‌గా చేరి, తర్వాత ఒరాకిల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనూ పనిచేశారు. అనంతరం చెల్లింపుల సంస్థ స్ట్రైప్లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా సాంకేతిక విభాగానికి నాయకత్వం వహించారు. ఆంత్రోపిక్ ప్రకారం, పాటిల్‌కు సాంకేతిక మౌలిక సదుపాయాల నిర్మాణం, నిర్వహణలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది.
క్లాడ్‌కు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఏఐ మౌలిక సదుపాయాలను విస్తరిస్తున్న సమయంలో ఆయన ఈ బాధ్యతలు చేపట్టారు. నియామక ప్రకటన సందర్భంగా, ఏఐ అభివృద్ధిలో కీలక దశలో ఆంత్రోపిక్‌లో చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన పాటిల్, సాంకేతికత ఎదుగుతున్నకొద్దీ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం, బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధి ముఖ్యమని అన్నారు.

