తెలంగాణ హౌసింగ్ బోర్డు చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల టవర్ గృహ నిర్మాణ ప్రాజెక్టులకు రెరా అనుమతులు లభించాయి. తొలి విడతలో మలక్పేట, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లోని ప్రాజెక్టులకు అనుమతులు మంజూరయ్యాయి.
లక్ష ఇళ్ల నిర్మాణం లక్ష్యం
క్యూర్ పరిధిలో ఈ పథకం ద్వారా లక్ష ఇళ్లను నిర్మించాలని హౌసింగ్ బోర్డు నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టుగా తొలి విడతలో 20 నియోజకవర్గాల్లో సుమారు 12 వేల ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది. ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్టులకు రెరా అనుమతులు రావడం ఇదే తొలిసారి.
రెరా అనుమతులు ఉన్న ప్రాజెక్టులకు బ్యాంకు రుణాల మంజూరు ప్రక్రియ వేగంగా సాగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల టవర్ ప్రాజెక్టులన్నింటికీ అనుమతుల కోసం హౌసింగ్ బోర్డు అధికారులు దరఖాస్తు చేశారు.
పేదలకు రూ.6 లక్షలకే ప్లాట్లు
బహిరంగ మార్కెట్లో సుమారు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు విలువ చేసే ప్లాట్లను పేదలకు రూ.6 లక్షలకే అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. భూమిని ఉచితంగా ఇచ్చి, రిజిస్ట్రేషన్ చేసి అందిస్తామని కూడా తెలిపింది.
రెరా చైర్మన్ శ్రీనివాసరాజు నుంచి హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతం అనుమతుల పత్రాలను అందుకున్నారు. ప్రభుత్వ ప్రాజెక్టులకు రెరా అనుమతులు రావడం హౌసింగ్ బోర్డు చరిత్రలో మైలురాయి అని గౌతం అన్నారు. దీనివల్ల ప్రాజెక్టులపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

