ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు దరఖాస్తు చేసుకోవడానికి ఇంటి పన్ను రసీదు అవసరం లేదని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. కొన్ని గ్రామాల్లో ఆ రసీదు తీసుకురావాలంటూ సందేశాలు వెళ్లడంతో ప్రజల్లో ఏర్పడిన గందరగోళానికి ఈ స్పష్టత ఇచ్చారు. పన్ను రసీదు లేకున్నా అర్హులు నమోదు చేసుకోవచ్చు.
ఎవరు అర్హులు?
ప్రతి కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే ఈ బీమా సౌకర్యం కల్పిస్తారు. కుటుంబ పెద్ద లేదా కుటుంబంలో సంపాదించే వ్యక్తి దరఖాస్తు చేసుకోవచ్చు. నమోదు సమయంలో వారి వయసు 18 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండాలి. వయసు నిర్ధారణకు ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటారు. ఆధార్లో పుట్టిన సంవత్సరం మాత్రమే ఉంటే జూలై 1వ తేదీని పుట్టిన తేదీగా పరిగణించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
అర్హులైన వ్యక్తికి రూ.5 లక్షల బీమా కవరేజీ కల్పిస్తారు. బీమా పొందిన వ్యక్తి మరణిస్తే, నమోదు సమయంలో ఎంపిక చేసిన నామినీ లేదా నామినీలకు ఈ మొత్తం అందుతుంది. ఒకరి కంటే ఎక్కువ మందిని నామినీలుగా పేర్కొంటే, రూ.5 లక్షలను వారికి ఏ నిష్పత్తిలో చెల్లించాలో ముందుగానే తెలియజేయాలి.
నమోదుకు కావాల్సినవి
దరఖాస్తుదారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు ప్రతులు సమర్పించి మొబైల్ నంబరు ఇవ్వాలి. రేషన్ కార్డు నంబరునే దరఖాస్తు సంఖ్యగా, ప్రత్యేక గుర్తింపుగా ఉపయోగిస్తారు. తెలంగాణలో జారీ చేసిన రేషన్ కార్డులున్నవారికే ఈ పథకం వర్తిస్తుంది. ఇంటి పన్ను రసీదును తప్పనిసరి పత్రాల జాబితాలో చేర్చలేదు.
గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో ఏర్పాటు చేసే శిబిరాలకు బీమా చేయించుకునే వ్యక్తి స్వయంగా వెళ్లి నామినీ వివరాలు అందించాలి. దివ్యాంగులు లేదా అనారోగ్యం కారణంగా శిబిరానికి రాలేని వారి వివరాలను శిబిరం ఇన్ఛార్జి ఇంటి వద్దకు వెళ్లి నమోదు చేసే ఏర్పాట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
బీమా కవరేజీ పాలసీ సంవత్సరం ముగిసే వరకు కొనసాగుతుంది. ఆ కాలంలో బీమా పొందిన వ్యక్తి గరిష్ఠ వయోపరిమితిని దాటినా, ఆ పాలసీ సంవత్సరం ముగిసేవరకు రక్షణ ఉంటుందని ప్రభుత్వ మార్గదర్శకాలు చెబుతున్నాయి.

