తెలంగాణ వ్యవసాయ రంగంలో ఫుడ్ ప్రాసెసింగ్, ఆహార నిల్వ సదుపాయాలు, పరిశోధన, సాంకేతిక పరిజ్ఞాన బదిలీకి సహకరిస్తామని జర్మనీ ప్రతినిధుల బృందం తెలిపింది. సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో బుధవారం జరిగిన భేటీలో ఈ అంశాలపై చర్చించారు.
వ్యవసాయ రంగంలో ఉన్న అవకాశాలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి బృందంతో మాట్లాడారు. తెలంగాణ నుంచి జర్మనీకి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పెంచేందుకు అవసరమైన ప్రయత్నాలు చేయాలని ఆయన కోరారు. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026లో పాల్గొని రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలను పరిశీలించాలని జర్మనీ ప్రతినిధులను ఆహ్వానించారు.
వ్యవసాయంపై ఐదు ప్రత్యేక సెషన్లు
డిసెంబరు 7 నుంచి 9 వరకు హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌లో వ్యవసాయ పెట్టుబడులు, సాంకేతికతపై ఐదు ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు, ఆహార వ్యవస్థల్లో కృత్రిమ మేధ వినియోగం, తెలంగాణను విత్తన రాజధానిగా బలోపేతం చేయడం, ఎఫ్ఎంసీజీ మరియు ఫుడ్ బ్రాండ్ల తయారీ నుంచి మార్కెటింగ్ వరకు అభివృద్ధి, రైతులను వ్యవసాయ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం వాటి అంశాలు.
సమ్మిట్‌లోని ఎక్స్పో ఏరియా-1లో ‘ఫామ్ టు ఫోర్క్’ ఇతివృత్తంతో అగ్రి ఎక్స్పో ఏర్పాటు చేయనున్నారు.

