స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పలు జిల్లాల్లో 44 ఘటనలు చోటుచేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. హింసకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, నిందితులను గుర్తించి చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
ఎన్నికల భద్రతకు పోలీసు బందోబస్తు
ఎన్నికల నిర్వహణ కోసం 46,380 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీజీపీ వెల్లడించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా, సాంకేతిక పరిజ్ఞానం, అదనపు బలగాలను వినియోగించి భద్రతను పర్యవేక్షించినట్లు తెలిపారు.
తొలి విడతలో 26 జిల్లాల్లోని 201 మండలాల్లో 3,191 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు, 25,061 వార్డు స్థానాలకు పోలింగ్ అనంతరం లెక్కింపు ప్రక్రియ జరిగింది. అలాగే 21 జిల్లాల్లోని నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లలో 258 వార్డులకు, 19 పట్టణ స్థానిక సంస్థల్లో 711 వార్డులకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని డీజీపీ చెప్పారు.
పల్నాడు, సత్యసాయి, నంద్యాల, కడప, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి తదితర జిల్లాల్లో నమోదైన ఘటనలకు సంబంధించి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను పటిష్ఠ బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించామని, ఎన్నికల అనంతరం అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉంటారని పేర్కొన్నారు.

