ఈజిప్టు రాజధాని కైరోలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో కనీసం 31 మంది ప్రాణాలు కోల్పోయారు. రింగ్ రోడ్డుపై ఆయిల్ ట్యాంకర్‌తో వెళ్తున్న ట్రక్కు బోల్తాపడటంతో మంటలు చెలరేగి, సమీపంలోని వాహనాలకు వ్యాపించాయి.
ఈజిప్టు ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రమాదంలో 21 మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రులకు తరలించేందుకు 39 అంబులెన్స్‌లను ఘటనా స్థలానికి పంపించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
సహాయక చర్యలు, దర్యాప్తు
మంటలు చుట్టుపక్కల భవనాలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి. మంటల్లో ప్రాణాలు కోల్పోయినవారిని గుర్తించేందుకు దర్యాప్తు సాగుతోందని, డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నామని ఈజిప్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు.
ప్రమాద స్థలాన్ని, సమీప ఆసుపత్రులను ఆరోగ్య శాఖ మంత్రి ఖలీద్ అబ్దెల్ గఫార్ సందర్శించినట్లు శాఖ తెలిపింది. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేయాలని ప్రధాన మంత్రి ముస్తఫా మద్బౌలీ ఆదేశించారు. పెట్రోలియం ఉత్పత్తుల రవాణా సమయంలో భద్రతా చర్యలను సమీక్షించే ముందు ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకుంటామని ప్రధాని అధికార ప్రతినిధి పేర్కొన్నారు.

