అమరావతి, సెప్టెంబర్ 11: వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సమావేశంలో సంక్షేమ పథకాల అమలుపై కీలక ఆదేశాలు వెలువడ్డాయి. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రత్యేకంగా ‘వెల్ఫేర్ క్యాలెండర్’ రూపొందించాలని కలెక్టర్లను చంద్రబాబు ఆదేశించారు. ఏ పథకం ఎప్పుడు, ఏ తేదీన లబ్ధిదారులకు అందుతుందో ముందుగానే స్పష్టంగా వెల్లడించాలని సూచించారు.
సంక్షేమ పథకాల కింద అందుతున్న నగదును లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. కేవలం నగదు పంపిణీతో సరిపెట్టకుండా.. ఆ సొమ్ము కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలా ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కులవృత్తులకు వాల్యూ అడిషన్ జరిగేలా కార్యాచరణ రూపొందించాలని చంద్రబాబు సూచించారు. చేనేత, చేతివృత్తుల కేంద్రాలను సాధారణ ఉత్పత్తి కేంద్రాలుగా కాకుండా ‘ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు’గా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు సంక్షేమ కార్యక్రమాలను పండగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్లకు సూచించారు.
కాపు కార్పొరేషన్ రుణాల విషయంలోనూ సీఎం కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడైనా నిధులు అందుబాటులో ఉండి వినియోగించకుండా ఉంటే వెంటనే వాటిని ఉపయోగించాలని సూచించారు. నిధుల కొరత ఉంటే తన దృష్టికి తీసుకురావాలని.. అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
మరోవైపు ఫ్యామిలీ మ్యాపింగ్ పేరుతో ఇష్టానుసారంగా పెన్షన్లు, ఇళ్లు కేటాయించడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాంటి విధానం సరికాదని, ప్రభుత్వం అనుసరించాల్సిన విధానం ‘కంబైన్డ్ ఫ్యామిలీ’ కాన్సెప్ట్ ఆధారంగా ఉండాలని స్పష్టం చేశారు. పెద్ద కుటుంబాలకు అవసరానికి అనుగుణంగా ఎక్కువ ప్రయోజనాలు అందేలా విధానాలను రూపొందించాలని కలెక్టర్లను ఆదేశించారు.
వక్ఫ్ బోర్డు ఆస్తులు, ఆదాయంపై కూడా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ బోర్డుకు పెద్ద ఎత్తున భూములు ఉన్నప్పటికీ వాటి నుంచి వస్తున్న ఆదాయం ఆశించిన స్థాయిలో లేదని పేర్కొన్నారు. ఆస్తులను సమర్థంగా వినియోగించి ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు.
దేవాదాయ శాఖ తరహాలో మైనార్టీ శాఖ కూడా ఆదాయాన్ని సమర్థంగా సమకూర్చుకునే విధంగా పనిచేయాలని చంద్రబాబు సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానాలులో ఒక్క రోజులో రూ.7 కోట్ల ఆదాయం వచ్చిన విషయాన్ని ప్రస్తావించిన సీఎం.. మైనార్టీ శాఖ పరిధిలోని ఆస్తుల ద్వారా కూడా ఆదాయం పెంచే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం అధికారులు మరింత చురుగ్గా పనిచేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలు, నిధుల వినియోగం, ఆస్తుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావు లేకుండా జిల్లాల వారీగా పర్యవేక్షణ పెంచాలని సూచించారు.

