ఆలయాల్లో ప్రత్యేక పూజలు, దీపారాధనలు
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లావ్యాప్తంగా మంగళవారం తెల్లవారుజాము నుంచే మహిళలు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. ఆసిఫాబాద్ పట్టణంలోని కేస్లాపూర్ అంజనేయస్వామి, సాయిబాబా, సందీప్‌నగర్ శివాలయం, బాలేశ్వర, అయ్యప్పస్వామి, కోదాండరామ ఆలయాల్లో భక్తులు దీపాలంకరణలో పాల్గొన్నారు. ఇళ్లలో తులసి, ఉసిరి మొక్కల వద్ద కూడా దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు.
ఉదయం మహిళలు దీపాలతో నగర సంకీర్తన చేపట్టి పెద్దవాగులో గంగాహారతి నిర్వహించారు. ఎల్లారం గ్రామస్థులు భక్తిగీతాలు ఆలపిస్తూ పాదయాత్రగా కేస్లాపూర్ అంజనేయస్వామి ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు.
కాగజ్‌నగర్‌లో క్షీరాభిషేకం
కాగజ్‌నగర్‌లోని ఈసుగాం ఆలయంలో కలెక్టర్ కె. హరిత శివలింగానికి క్షీరాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆమెను సన్మానించారు. పట్టణం, మండలంలోని పలు ఆలయాల్లో ఉదయం దీపాలు వెలిగించి పూజలు చేశారు. ఈసుగాం శివమల్లన్న ఆలయంలో శివలింగాన్ని అలంకరించగా, రాత్రి జ్వాలాతోరణం, శివపార్వతుల ఊరేగింపు నిర్వహించారు.
మండలాల్లోనూ భక్తి కార్యక్రమాలు
బెజ్జూరు, కెరమెరి, సిర్పూరు(టి), రెబ్బెన, కౌటాల, చింతలమానేపల్లి, పెంచికల్పేట్, తిర్యాణి, దహెగాం మండలాల్లోనూ ఆలయాల్లో పూజలు, దీపారాధనలు జరిగాయి. పలు గ్రామాల్లో తులసి పూజలు, తులసి కల్యాణాలు నిర్వహించారు. కెరమెరి పెద్దవాగు, కుమురం భీం బ్యాక్‌వాటర్ సమీపంలో దీపారాధనలు చేపట్టారు. కెరమెరి శివాలయంలో పూజల అనంతరం అన్నదానం చేశారు.
కౌటాల, పెంచికల్పేట్ ప్రాంతాల్లో భక్తులు ప్రాణహిత నదిలో స్నానాలు ఆచరించి ఆలయాల్లో పూజలు చేశారు. రావి చెట్ల వద్ద దీపాలు వెలిగించారు. సిర్పూరు(టి)లోని ఆలయాల్లో దీపాలు అలంకరించగా, గోవింద్పూర్ హనుమాన్ ఆలయం నుంచి శివాలయం వరకు భక్తులు భజనలతో వెళ్లారు. తిర్యాణిలో వాగుల్లో స్నానాలు చేసి దీపారాధనలు నిర్వహించారు.

