విజయనగరం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సీనరేజీ కలెక్షన్ కాంట్రాక్టుల కోసం టెండర్లు నిర్వహించేందుకు గనుల శాఖ సన్నాహాలు చేస్తోంది. పాత ఏజెన్సీల కాంట్రాక్టుల కాలపరిమితి ముగియడంతో కొత్త ఏజెన్సీల ఎంపికకు ఈ ప్రక్రియ చేపట్టనుంది.
ఎన్నికల కమిషన్ అనుమతి కోసం లేఖ
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున టెండర్ల నిర్వహణకు అనుమతి కోరుతూ గనుల శాఖ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాసింది. అనుమతి వచ్చిన తర్వాత టెండర్ల ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం. ఈ మూడు జిల్లాల నుంచి నెలకు సగటున రూ.37.3 కోట్ల ఫీజు ఆదాయం రావచ్చని గనుల శాఖ అంచనా వేసింది.
శ్రీకాకుళంలో బకాయిలు
శ్రీకాకుళం జిల్లాలో గతంలో సీనరేజీ కాంట్రాక్టు నిర్వహించిన ఏజెన్సీ నుంచి రూ.85.80 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని గనుల శాఖ ప్రభుత్వానికి నివేదించింది.
తూర్పుగోదావరి, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లోనూ కలెక్షన్ ఏజెన్సీల ఎంపికకు గతంలో టెండర్లు పిలిచారు. అయితే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అనుగుణంగా బిడ్లు రాకపోవడంతో రిజర్వ్ ప్రైస్ సవరణపై గనుల శాఖ కసరత్తు చేస్తోంది.

