ఐదేళ్ల సేవ పూర్తికాకపోయినా, నిర్దిష్ట పరిస్థితుల్లో ఉద్యోగికి గ్రాట్యుటీ అర్హత రావచ్చని కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఐదో సంవత్సరం సేవలో 12 నెలల వ్యవధిలో కనీసం 240 రోజులు పనిచేసిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.
మాజీ ఉద్యోగికి రూ.1.75 లక్షల చెల్లింపు
బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేసిన ఓ వ్యక్తి 2017 జూలై 6న ఉద్యోగంలో చేరాడు. 2022 మార్చి 19న రాజీనామా చేయగా, ఏప్రిల్ 18న సేవల నుంచి రిలీవ్ అయ్యాడు. అతడి సేవా కాలం నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల 12 రోజులు. ఐదేళ్లు పూర్తి కాలేదన్న కారణంతో రూ.1.75 లక్షల గ్రాట్యుటీని చెల్లించేందుకు సంస్థ నిరాకరించడంతో, ఉద్యోగి హైకోర్టును ఆశ్రయించాడు.
ఐదో సంవత్సరం సేవలో 240 రోజులకు పైగా పనిచేశానని, గ్రాట్యుటీ చెల్లించేలా సంస్థను ఆదేశించాలని ఆయన పిటిషన్లో కోరాడు. పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, రూ.1.75 లక్షల గ్రాట్యుటీతో పాటు 10 శాతం వడ్డీని కూడా చెల్లించాలని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్‌ను ఆదేశించింది.
చట్టంలోని రెండు సెక్షన్లను కలిపి చూడాలి
గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం, 1972లోని సెక్షన్ 4(1) ఐదేళ్ల సేవను అర్హతగా పేర్కొంటుంది. అయితే నిరంతర సేవను నిర్ణయించే సెక్షన్ 2Aను పక్కనపెట్టి ఈ నిబంధనను మాత్రమే వర్తింపజేయలేమని కోర్టు తెలిపింది. సెక్షన్ 2A ప్రకారం, 12 నెలల వ్యవధిలో కనీసం 240 రోజులు పనిచేస్తే ఒక సంవత్సరం నిరంతర సేవ పూర్తయినట్లుగా పరిగణించే అవకాశం ఉంది.
ఉద్యోగంలో చేరిన తేదీ, రాజీనామా చేసిన తేదీ మధ్య ఉన్న క్యాలెండర్ కాలాన్ని మాత్రమే లెక్కించి అర్హతను నిర్ణయించడం సరిపోదని కోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగి వాస్తవంగా పనిచేసిన రోజులు, సెక్షన్ 2Aలోని నిరంతర సేవ నిబంధన వర్తిస్తుందా అనే అంశాలను సెక్షన్ 4(1)తో కలిపి పరిశీలించాలని పేర్కొంది.

