హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ భూముల విక్రయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం హెచ్ఎండీఏ కార్యాలయాన్ని ముట్టడిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రకటించారు. వామపక్షాల సహకారంతో నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
ప్రజోపయోగానికి భూములు కేటాయించాలని డిమాండ్
మియాపూర్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, హుడా ట్రక్ పార్క్ సహా నివాస ప్రాంతాల మధ్య ఉన్న ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకు బదులుగా కార్పొరేట్ సంస్థలకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు శంభీపూర్ రాజు పేర్కొన్నారు.
కూకట్పల్లి పరిసరాల్లో ట్రక్ పార్క్ కోసం సేకరించిన భూములను ఆ అవసరానికే వినియోగించాలని ఆయన కోరారు. అలా చేయకపోతే స్థానికుల ప్రయోజనాల కోసం మౌలిక వసతుల కల్పనకు కేటాయించాలని అన్నారు. ముట్టడి కార్యక్రమంలో బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత టి. హరీశ్‌రావు తదితరులు పాల్గొంటారని తెలిపారు.

