సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణానికి చెందిన 14 నెలల దీక్షికారెడ్డి స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (SMA)తో బాధపడుతోంది. చిన్నారి కూర్చోలేక, నిలబడలేక ఇబ్బందిపడుతోందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు.
చికిత్సకు భారీ ఖర్చు
పాప పాకకపోవడంతో నిమ్స్, రెయిన్బో ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించారు. వెన్నెముక కండరాలను నియంత్రించే నరాలు దెబ్బతిన్నాయని, చిన్నారికి SMA ఉన్నట్లు వైద్యులు నిర్ధారించినట్టు కుటుంబం తెలిపింది. వ్యాధి ముదిరితే శ్వాస తీసుకోవడం, ఆహారం మింగడం కూడా కష్టమవుతుందని వైద్యులు వివరించారు.
చికిత్స కోసం ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని, దానికి రూ.9 కోట్ల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పినట్లు తల్లిదండ్రులు వెల్లడించారు. ఆ ఇంజక్షన్‌ను రెండేళ్ల వయసులోపే ఇవ్వాల్సి ఉండటంతో, చిన్నారికి మరో పది నెలల గడువు ఉందని వారు పేర్కొన్నారు.
సాయం కోసం తల్లిదండ్రుల విజ్ఞప్తి
హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజశేఖర్‌రెడ్డి, ఆయన భార్య మౌనిక తమ కుమార్తె చికిత్సకు ప్రభుత్వం, దాతలు సాయం చేయాలని కోరారు. సాయం చేయదలచినవారు 8143175417 నంబరులో సంప్రదించాలని కుటుంబం విజ్ఞప్తి చేసింది.

