నైజీరియాలోని బాయెల్సా రాష్ట్రంలో శుక్రవారం పడవ బోల్తా పడిన ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళ్తున్న ప్రయాణికులు పడవలో ఉన్నారు. ప్రమాదం నుంచి బయటపడిన మరో 24 మందిని సహాయక సిబ్బంది రక్షించి ఆసుపత్రికి తరలించారు.
గల్లంతైనవారి కోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పడవలో మొత్తం ఎంతమంది ప్రయాణించారు, ఇంకా ఎంతమంది ఆచూకీ తెలియాల్సి ఉందనే వివరాలు అందుబాటులో లేవు.
సాంకేతిక సమస్యపై ప్రాథమిక విచారణ
నైజీరియా జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ ప్రతినిధి మాంజో ఎజెకీ తెలిపిన వివరాల ప్రకారం, అంత్యక్రియలకు వెళ్లేందుకు ప్రయాణికులను తీసుకెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. పడవలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని పోలీసు ప్రతినిధి మూసా మహమ్మద్ తెలిపారు.
పడవను ఒడ్డుకు మళ్లించాలని కోరినా నడిపిన వ్యక్తి పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు. ఆ తర్వాత అతడు అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పడవ నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భద్రతా నిబంధనలు పాటించాలని సూచన
పడవ నిర్వాహకులు, ప్రయాణికులు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని బాయెల్సా రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. పడవల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం, అతివేగం, నిర్లక్ష్యం, లైఫ్జాకెట్లు లేకుండా ప్రయాణించడం వంటి చర్యలను నిలిపివేయాలని రాష్ట్ర సమాచార కమిషనర్ ఎబియువోకు కోకు-ఒబియాయ్ విజ్ఞప్తి చేశారు.

