గుంటూరు, సెప్టెంబర్ 12: గుంటూరు జిల్లాలోని పొన్నూరులో ఓ మహిళ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. ప్రియుడితో కలిసి కుమార్తెనే తల్లిని హత్య చేసిందని మృతురాలి బంధువులు ఆరోపించడం తీవ్ర సంచలనంగా మారింది. అయితే ఈ ఆరోపణలు ఇంకా నిర్ధారణ కాలేదు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
పొన్నూరు పట్టణంలోని క్యాబిన్ పేటకు చెందిన ఈవూరు లక్ష్మి (45) తన కుమార్తె పుష్పతో కలిసి 8వ వార్డులో నివాసం ఉంటున్నారు. లక్ష్మి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. తల్లి అనారోగ్యంతోనే చనిపోయిందని కుమార్తె చెబుతుండగా.. ఆరోగ్యంగా ఉన్న లక్ష్మి అకస్మాత్తుగా మృతి చెందడంపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేశారు.
కుమార్తె తన ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిందని బంధువులు పోలీసులకు అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో పోలీసులు కేసును సీరియస్గా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించడంతో పాటు కుమార్తె, ఇతర బంధువులను విచారిస్తున్నారు. కుమార్తె ప్రియుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత లక్ష్మి మృతికి అసలు కారణం ఏంటనే దానిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. హత్య జరిగిందా? లేక అనారోగ్యంతోనే మరణించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

