ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో, దాని కదలికలను గమనించి సురక్షితంగా పట్టుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశించారు. పులి సంచార ప్రాంతాలు, ఇప్పటివరకు చేపట్టిన చర్యలపై అధికారులతో సమీక్షించారు.
పులి కదలికల గుర్తింపునకు సాంకేతిక పరికరాలు
పులిని నిరంతరం ట్రాక్ చేసేందుకు థర్మల్ డ్రోన్లు, ఏఐ ఆధారిత కెమెరా ట్రాప్లను విస్తృతంగా వినియోగించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. స్థానిక అటవీ బృందాలతో సమన్వయం చేసుకుంటూ హనుమాన్ బృందాలతో గస్తీ నిర్వహించాలని, ఆపరేషన్‌ను పీసీసీఎఫ్, చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ పర్యవేక్షించాలని కోరారు.
అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేక ట్రాకింగ్, రెస్క్యూ నిపుణుల బృందాలను రప్పించాలని కూడా సూచించారు. పులి సంచార మార్గాల సమాచారాన్ని పరిసర గ్రామాలకు ఎప్పటికప్పుడు తెలియజేసి, రైతులు, పశువుల కాపరులు అటవీ ప్రాంతాల్లోకి వెళ్లకుండా అప్రమత్తం చేయాలని అధికారులకు చెప్పారు.
ప్రజలు, వన్యప్రాణి భద్రతకు ప్రాధాన్యం
ఆపరేషన్‌లో ప్రజల ప్రాణ రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పులికి హాని జరగకుండా వన్యప్రాణి సంరక్షణ నిబంధనల ప్రకారం సురక్షితంగా పట్టుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు పోలీసు, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆదేశించారు.

