ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ఆరా తీశారు. ఇటీవల అస్వస్థతకు గురైన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ప్రధాని, స్వయంగా ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ విషయాన్ని మోదీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలోకి రావాలని ప్రధాని ఆకాంక్షించారు. వీరిద్దరి మధ్య ఉన్న సన్నిహిత సంబంధానికి ఈ పరామర్శ ఉదాహరణగా నిలిచింది.
ఇటీవల తీవ్ర పని ఒత్తిడి, ఆరోగ్య సమస్యల కారణంగా పవన్ అస్వస్థతకు గురైనట్లు సమాచారం. శుక్రవారం అధికారులతో సమావేశంలో ఉన్న సమయంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురవడంతో వెంటనే హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి తక్షణమే శస్త్రచికిత్స నిర్వహించారు.
కొన్ని రోజులుగా సైనసైటిస్ సమస్యతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ కు ముక్కు శస్త్రచికిత్స చేసినట్లు సమాచారం. ఆపరేషన్ విజయవంతమైందని వైద్యులు వెల్లడించడంతో జనసేన కార్యకర్తలు, అభిమానులు ఊరట పొందారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఆయన కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. అయితే మరికొన్ని రోజులు పూర్తి విశ్రాంతి అవసరమని సూచించారు. దీనితో ఆయన అధికారిక కార్యక్రమాలు తాత్కాలికంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది.
ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ సహా అనేక రాజకీయ నాయకులు పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఇదిలా ఉంటే, సోషల్ మీడియాలో పవన్ ఆరోగ్యంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అభిమానులు #PawanKalyan, #GetWellSoonOG వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో పోస్టులు చేస్తూ తమ మద్దతును వ్యక్తం చేస్తున్నారు.

