విజయవాడ: భారీ వివాదానికి దారి తీసిన లూలు మాల్ భూముల కేటాయింపు వ్యవహారంలో చివరకు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విజయవాడలో లూలు మాల్‌కు కేటాయించిన భూమిపై దాఖలైన పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (PIL)పై ఏపీ హైకోర్టు విచారణ జరిపిన సందర్భంగా, ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. లూలు గ్రూప్‌కు ఇచ్చిన భూమి కేటాయింపును రద్దు చేసుకుంటున్నామని కోర్టుకు తెలిపింది.
ఈ నిర్ణయం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గతంలో ఈ ప్రాజెక్టును “అభివృద్ధి ప్రతీక”గా ప్రచారం చేయడం, ఇప్పుడు అదే ప్రాజెక్టుపై వెనక్కి తగ్గడం విమర్శలకు కారణమవుతోంది. అలాగే ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా ఈ ప్రాజెక్టును మద్దతు ఇచ్చిన నేపథ్యంలో, ఈ యూటర్న్‌పై రాజకీయ ప్రత్యర్థులు తీవ్రంగా దాడి చేస్తున్నారు.
విజయవాడ గవర్నర్‌పేటలోని పాత బస్టాండ్‌గా ప్రసిద్ధి చెందిన ఆర్టీసీ డిపోకు చెందిన సుమారు 4.15 ఎకరాల విలువైన భూమిని లూలు సంస్థకు అప్పగించేందుకు ప్రభుత్వం 99 ఏళ్ల లీజు విధానంలో ఒప్పందం కుదుర్చుకుంది. బహిరంగ మార్కెట్‌లో ఈ భూమి విలువ రూ.600 కోట్లకు పైగా ఉండగా, పారదర్శకత లేకుండా ప్రైవేట్ సంస్థకు అప్పగించారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
జీ+3 విధానంలో భారీ షాపింగ్ మాల్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం, టెండర్ ప్రక్రియ లేకపోవడం, ప్రజా ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం వంటి అంశాలపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశాయి. చివరకు ఈ ఒత్తిడి, కోర్టు విచారణల మధ్య ప్రభుత్వం యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది.
గతంలో “లూలు వస్తే అభివృద్ధి పరుగులు పెడుతుంది” అంటూ ప్రశంసలు కురిపించిన నాయకత్వం, ఇప్పుడు అదే ప్రాజెక్టుపై నిశ్శబ్దం పాటించడం అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు ఒప్పందాలు, లాభనష్టాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

