ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు గ్రేటర్ ఆర్టీసీ జోన్లో కొత్త రూట్లకు బస్సులు నడపాలని ఆర్టీసీ చర్యలు చేపడుతోంది. డిపోల వారీగా శివారు ప్రాంతాలు, ప్రయాణికుల రాకపోకలు, ఎక్కువ రద్దీ ఉండే మార్గాల వివరాలను సేకరించి, అవసరానికి అనుగుణంగా బస్సులను అందుబాటులోకి తేనుంది.
ట్రిప్పులు పెంచే లక్ష్యం
గ్రేటర్ జోన్లోని 27 డిపోల నుంచి ప్రస్తుతం 3,212 సిటీ బస్సులు రోజుకు 32 వేల ట్రిప్పులు నిర్వహిస్తున్నాయి. ఆరు నెలల్లో ట్రిప్పుల సంఖ్యను 40 వేలకు పెంచాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ బస్సుల్లో రోజుకు 26 లక్షల మంది ప్రయాణిస్తుండగా, వారిలో 18 లక్షల మంది మహిళలు ఉన్నారు. మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం తర్వాత ప్రయాణికుల ఆక్యుపెన్సీ వంద శాతానికి చేరిందని వివరాలు చెబుతున్నాయి. ఉదయం, సాయంత్రం రద్దీ మార్గాల్లో బస్సులు ప్రయాణికులతో నిండిపోతున్నాయి.
కొత్త డిపోలు, ఎలక్ట్రిక్ బస్సుల ప్రణాళిక
కొత్త బస్సులు, డిపోల ఏర్పాటుపై ఆర్టీసీ పరిశీలన చేస్తోంది. జవహర్నగర్, బ్రహ్మన్పల్లిలో రెండు బస్ డిపోలు ఏర్పాటు చేయనుంది. క్యూర్ పరిధిలోని జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీల భౌగోళిక స్వరూపానికి సరిపోయేలా గ్రేటర్ ఆర్టీసీ జోన్ రూట్మ్యాప్లను సిద్ధం చేస్తోంది. 2027 డిసెంబరు నాటికి క్యూర్ పరిధిలో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులనే నడపాలని లక్ష్యంగా పెట్టుకుంది.

