టీడీపీ ముఖ్య నేతలు, మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానిక ఎన్నికల ఫలితాలు, రానున్న పంచాయతీ ఎన్నికలు, ఏకగ్రీవాలపై చర్చించారు. గ్రామాభివృద్ధికి ఉపయోగపడేలా పంచాయతీల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని సూచించారు.
ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకం
ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పంచాయతీలకు ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలను ప్రజలకు వివరించాలని చంద్రబాబు అన్నారు. ఐదు వేలలోపు జనాభా ఉన్న పంచాయతీకి రూ.15 లక్షలు, ఐదు వేల నుంచి పది వేల మధ్య జనాభా ఉన్న పంచాయతీకి రూ.25 లక్షలు, పది వేలకుపైగా జనాభా ఉన్న పంచాయతీకి రూ.50 లక్షలు అందించే ప్రోత్సాహకాల గురించి తెలియజేయాలని సూచించారు.
పార్టీ గుర్తులు లేకుండా జరిగే పంచాయతీ ఎన్నికల్లో అందరి ఆమోదంతో ఏకగ్రీవాలు జరిగితే, ఆ నిధులను గ్రామ అభివృద్ధి పనులకు వినియోగించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించాయని, అవి ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనకు గుర్తింపని చంద్రబాబు అన్నారు.
ప్రజాభిప్రాయాన్ని గొడ్డలి పార్టీ జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ఓట్లుగా మలుచుకోవాలని, పార్టీలో నేతల మధ్య పంతాలు, ఇగోలకన్నా ఐక్యత ఉండాలని సూచించారు.

