శబరిమలకు వచ్చే యాత్రికులకు ప్రయాణ, దర్శన, భద్రతా వివరాలు అందించేందుకు కేరళ అటవీ శాఖ ‘అయ్యన్ 4.0’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. అటవీ శాఖ మంత్రి శిబు బేబీ జాన్ ఈ యాప్‌ను ప్రారంభించారు. మలయాళం, ఇంగ్లిష్, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఉపయోగించవచ్చు. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్లైన్లోనూ పనిచేస్తుంది.
యాత్ర, భద్రతా సమాచారం
యాప్‌లో ప్రధాన యాత్రా మార్గాలు, దూరాలు, పార్కింగ్ స్థలాలు, విశ్రాంతి కేంద్రాలు, దర్శన వేళలు, వాతావరణం, రవాణా సదుపాయాల వివరాలు ఉన్నాయి. అటవీ మార్గాల్లో పాటించాల్సిన జాగ్రత్తలు, వన్యప్రాణుల నుంచి రక్షణ, పాముకాటు సమయంలో ప్రథమ చికిత్స, యాంటీవెనమ్ ఉన్న ఆసుపత్రుల సమాచారాన్ని కూడా పొందవచ్చు. అత్యవసర సహాయం, హెల్ప్‌లైన్ నంబర్లు, పోగొట్టుకున్న వస్తువుల గుర్తింపునకు సంబంధించిన సదుపాయాలు ఇందులో ఉన్నాయి.
భక్తుల రద్దీ, విశ్రాంతి కేంద్రాల వద్ద జనసాంద్రత, అటవీ మార్గాల్లో రాకపోకలను పర్యవేక్షించేందుకు అధికారుల కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. పెరియార్ టైగర్ రిజర్వ్ జీవవైవిధ్యం, వన్యప్రాణుల వివరాలూ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి.
దర్శనానికి పెరుగుతున్న భక్తుల సంఖ్య
శబరిమల ఆలయ ద్వారాలు నవంబర్ 16న తెరుచుకున్నాయి. శుక్రవారం 60,635 మంది దర్శనం చేసుకోగా, వర్చువల్ క్యూ ద్వారా 64 వేల మంది బుక్ చేసుకున్నారు. శనివారం సాయంత్రం 4 గంటల వరకు 46,266 మంది వచ్చారు. రానున్న రోజుల్లో రోజువారీ భక్తుల సంఖ్య 70 వేల నుంచి 80 వేలకు చేరవచ్చని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అంచనా వేసింది.
రోజుకు అదనంగా 5 వేల వర్చువల్ క్యూ స్లాట్లకు అనుమతి ఇవ్వడంతో దర్శన సామర్థ్యం 85 వేల మందికి చేరే అవకాశం ఏర్పడింది. ఈ అదనపు టికెట్లను ఒకేసారి కాకుండా, రైల్వే తత్కాల్ విధానంలో దశలవారీగా విడుదల చేయాలని బోర్డు నిర్ణయించింది.

