హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో గుర్తించిన 720 మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో (ఎస్టీపీలు) కేవలం 30 శాతం మాత్రమే పనిచేస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. పనిచేస్తున్నట్లు కనిపిస్తున్న కేంద్రాల్లోనూ నీటిని పూర్తిస్థాయిలో శుద్ధి చేస్తున్నవి పదిలోపే ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు.
నల్లగండ్ల ఎస్టీపీ నుంచి నమూనాల సేకరణ
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నల్లగండ్లలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఎస్టీపీని పరిశీలించారు. అక్కడి నుంచి శుద్ధి చేసిన నీటి నమూనాలను సేకరించి, పరీక్షల కోసం కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ప్రయోగశాలకు పంపారు. పరీక్షలతో నీటి నాణ్యత, శుద్ధి కేంద్రం పనితీరును అంచనా వేయనున్నారు.
గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లలో కొన్ని ఎస్టీపీలు నిలిపివేయడం లేదా నామమాత్రంగా నడపడం జరుగుతోందని తనిఖీల్లో అధికారులు గుర్తించారు. నిర్వహణ ఖర్చులు, సిబ్బంది కొరత, విద్యుత్తు బిల్లుల భారం వంటి కారణాలు చూపుతున్నట్లు వారు తెలిపారు. సరిగా శుద్ధి చేయని నీటిని కాలువల్లోకి విడుదల చేస్తున్న కేంద్రాలను గుర్తించి నమూనాలు పరీక్షించాలని హైడ్రా భావిస్తోంది.
ప్రత్యేక విద్యుత్తు మీటర్లపై పరిశీలన
ఎస్టీపీలు వాస్తవంగా పనిచేస్తున్నాయా అని తెలుసుకునేందుకు ప్రత్యేక విద్యుత్తు మీటర్లు ఏర్పాటు చేసే అంశాన్ని విద్యుత్తుశాఖ పరిశీలిస్తోంది. ఆ మీటర్ల ద్వారా కేంద్రాలకు సరఫరా అవుతున్న విద్యుత్తు, వినియోగాన్ని పర్యవేక్షించవచ్చని భావిస్తున్నారు.
జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ రికార్డుల ప్రకారం ఔటర్ పరిధిలో 720 ఎస్టీపీలు ఉన్నాయి. నగరంలో నీటి కొరత నేపథ్యంలో మురుగునీటిని శుద్ధి చేసి తాగునీటేతర అవసరాలకు మళ్లీ వినియోగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వ ఎస్టీపీల నుంచి పునర్వినియోగానికి అనువైన నీరు రోజుకు 7 ఎంఎల్డీ మాత్రమే ఉత్పత్తి అవుతోందని అందుబాటులో ఉన్న వివరాలు చెబుతున్నాయి.

