బాగ్డోగ్రా విమానాశ్రయానికి వెళ్లే, అక్కడి నుంచి తిరిగివచ్చే సైనిక విమానాల కోసం నేపాల్ గగనతలాన్ని ఉపయోగించుకునేందుకు అనుమతి కోరినట్లు వచ్చిన వార్తలను భారత ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేశాయి.
పౌర విమానాల అంశం వేరు
బాగ్డోగ్రాకు రాకపోకలు సాగించే పౌర విమానాల కోసం నేపాల్ గగనతల వినియోగ అవకాశంపై భారత్ చర్చిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇరు దేశాల మధ్య విమానయాన అనుసంధానాన్ని విస్తరించే అంశంలో ఇది భాగమని ప్రచారం జరిగింది. అయితే సైనిక విమానాలకు సంబంధించి మాత్రం ఎలాంటి ప్రతిపాదన లేదని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
భారత్లో నేపాల్ ప్రధాని పర్యటన
నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా నవంబర్ 22న భారత్కు వచ్చారు. 2026 మార్చిలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు ఇది తొలి భారత పర్యటనతోపాటు, తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటనగా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఈ పర్యటన చేపట్టారు.
నవంబర్ 23న మోదీ, షా ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. భారత్-నేపాల్ సంబంధాలను సమీక్షించడంతోపాటు, పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలు, వివిధ రంగాల్లో సహకార విస్తరణపై ఇరువురు మాట్లాడనున్నట్లు సమాచారం.
నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం, షా నేపాల్ ఎయిర్లైన్స్ విమానంలో న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఆయన వెంట ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లే, విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్, ప్రధానమంత్రి ముఖ్య సలహాదారు కుమార్ బయాంకర్తోపాటు అధికారులు ఉన్నారు.

