సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌ల్లో బరోడా, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, హైదరాబాద్ జట్లు విజయాలు సాధించాయి. జితేశ్ శర్మ, తేజస్వి దహియా, అబ్దుల్ సమద్ బ్యాటింగ్‌తో ఆకట్టుకోగా, హైదరాబాద్ కెప్టెన్ సీవీ మిలింద్ బౌలింగ్‌లో కీలక పాత్ర పోషించాడు.
జితేశ్ అర్ధశతకంతో బరోడా గెలుపు
బెంగాల్‌తో జరిగిన ఎలైట్ గ్రూప్-ఏ మ్యాచ్‌లో బరోడా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగాల్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 172 పరుగులు చేసింది. కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 78 పరుగులు చేయగా, అభిషేక్ పొరేల్ 29 పరుగులు సాధించాడు.
లక్ష్య ఛేదనలో జితేశ్ శర్మ 29 బంతుల్లో 54 పరుగులు చేసి బరోడాకు విజయాన్ని అందించాడు. ఆ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.
తేజస్వి దహియా మెరుపు ఇన్నింగ్స్
హర్యానాతో జరిగిన ఎలైట్ గ్రూప్-బి మ్యాచ్‌లో ఢిల్లీ 43 పరుగుల తేడాతో నెగ్గింది. ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 232 పరుగులు చేసింది. తేజస్వి దహియా 36 బంతుల్లో 95 పరుగులు సాధించగా, ప్రియాన్ష్ ఆర్య 40 బంతుల్లో 62 పరుగులు చేశాడు. లక్ష్య ఛేదనలో హర్యానా ఎనిమిది వికెట్లకు 189 పరుగులకే పరిమితమైంది.
జమ్మూ కశ్మీర్‌కు అబ్దుల్ సమద్ అండ
పంజాబ్ నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యాన్ని జమ్మూ కశ్మీర్ 19.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అబ్దుల్ సమద్ 27 బంతుల్లో అజేయంగా 64 పరుగులు చేశాడు. అంతకుముందు పంజాబ్ మూడు వికెట్లకు 195 పరుగులు చేసింది. విహాన్ మల్హోత్రా 85, కెప్టెన్ రమణ్‌దీప్ సింగ్ 50 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
మిలింద్ బౌలింగ్‌తో హైదరాబాద్ విజయం
ఉత్తరాఖండ్‌తో జరిగిన ఎలైట్ గ్రూప్-డీ మ్యాచ్‌లో హైదరాబాద్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. సీవీ మిలింద్ 25 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసుకోవడంతో ఉత్తరాఖండ్ 19.2 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ 15.3 ఓవర్లలో ఆరు వికెట్లకు 149 పరుగులు చేసి లక్ష్యాన్ని చేరుకుంది. కొడిమెల హిమతేజ 40 బంతుల్లో 77 పరుగులు చేశాడు.

