ముంబయి: సీజేపీ నిరసనల్లో పాల్గొన్న నేపధ్యంలో నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ముంబయి పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఆమిర్ ఖాన్ మేనల్లుడైన ఇమ్రాన్ ఖాన్ అమెరికా పౌరసత్వం కలిగి ఉండటంతో, అక్టోబర్ 28లోగా భారత్‌ను వీడాలని సూచించినట్లు సమాచారం. ఈ పరిణామం రాజకీయంగానూ, సినీ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.
ఇటీవల ముంబయిలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనలో ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నారని, దీనిపై భాజపా నేత కిరీట్ సోమయ్య ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. విదేశీ పౌరుడైన ఇమ్రాన్ ఖాన్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా, వీసా నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నిరసనల సమయంలో ఇమ్రాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని, అనంతరం విడుదల చేసినట్లు కూడా సమాచారం.
ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు జారీ కావడంపై కిరీట్ సోమయ్య స్పందిస్తూ, పోలీసుల చర్యను స్వాగతించారు. పాకిస్థాన్ నుంచి నిధులు తీసుకుని విదేశీ శక్తులతో కలిసి దేశంలో అల్లర్లు రేపే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ, అందుకే తాను ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కాగా, ముంబయిలో ఆగస్ట్ క్రాంతి మైదాన్ వద్ద జరిగిన ఈ నిరసనలో ఇమ్రాన్‌తో పాటు నటి జైన్ మేరీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

