కేంద్ర ఎన్నికల సంఘంలో కమిషనర్ల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయంటూ వచ్చిన వార్తలపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థలపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉండాలని, కమిషనర్ల మధ్య విభేదాలపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాలని ఆయన కోరారు.
ఎన్నికల సంఘంలోని ఇద్దరు కమిషనర్లు గత పది నెలల్లో 14 సందర్భాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేశారంటూ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రచురించింది. ఓటర్ల జాబితాల్లో కొత్త పేర్ల చేర్పులు, పేర్ల తొలగింపులు, తొలగించిన పేర్ల పునరుద్ధరణ, ఓటర్ల సమాచారానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్ వంటి అంశాలపై అభ్యంతరాలు నమోదైనట్లు ఆ కథనం పేర్కొంది.
ఈ పరిణామాలపై జగన్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఎన్నికల సంఘంలో ఏయే అంశాలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి? వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఓటర్ల జాబితా నిర్వహణలో పారదర్శకత ఎంతవరకు ఉంది? అనే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని కోరారు. ఆరోపణలు, ప్రత్యారోపణలకే పరిమితం కాకుండా వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు.
14 అభ్యంతరాలపై ఈసీ ఏమంటోంది?
కమిషనర్ల మధ్య విభేదాలున్నాయంటూ వచ్చిన వార్తలపై ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. కమిషనర్లు లేవనెత్తిన ప్రశ్నలు, సూచనలు నిర్ణయ ప్రక్రియలో భాగమేనని తెలిపింది. భిన్నాభిప్రాయాలు ఉండటం సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగమని, తుది నిర్ణయాలు మాత్రం ఏకగ్రీవంగానే తీసుకున్నామని స్పష్టం చేసింది.
అయితే ఈ వివరణపై జగన్ మరింత స్పష్టత కోరారు. ఓటర్ల జాబితాల్లో పేర్ల చేర్పులు, తొలగింపులు, పునరుద్ధరణలు ఏ విధంగా జరిగాయి? క్షేత్రస్థాయి అధికారులకు ఎంత స్వతంత్రత ఉంది? ఓటర్ల డేటా నిర్వహణలో ఎలాంటి పర్యవేక్షణ ఉంది? వంటి అంశాలపై ప్రజలకు వివరాలు అందించాలని అన్నారు.
2023 ఎన్నికల కమిషనర్ల నియామక చట్టంపై మళ్లీ చర్చ
ఎన్నికల కమిషనర్ల నియామక విధానాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభ ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉండే కమిటీ విధానాన్ని తిరిగి తీసుకురావాలని సూచించారు.
2023లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం నియామక కమిటీలో ప్రధానమంత్రి, ప్రధానమంత్రి నామినేట్ చేసే కేంద్ర క్యాబినెట్ మంత్రి, లోక్‌సభ ప్రతిపక్ష నేత ఉంటారు. ఈ విధానంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యుడిగా ఉండరు. ఈ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనం పరిశీలనకు పంపే అంశం తాజాగా సుప్రీంకోర్టులో చర్చకు వచ్చింది.
ఏపీలో SIR, స్థానిక ఎన్నికల అంశాలపైనా జగన్ ప్రస్తావన
ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ సందర్భంగా వైఎస్సార్‌సీపీ పలు అభ్యంతరాలు తెలిపినా తగిన స్పందన రాలేదని జగన్ ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వార్డులు, డివిజన్ల పునర్విభజనలోనూ తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు.
ఈ ఆరోపణలపై సంబంధిత అధికారుల వివరణను కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో సందేహాలు తొలగించేందుకు పారదర్శకత, జవాబుదారీతనం కీలకమని అన్నారు.
ఓటు హక్కుపై ప్రజలకు భరోసా అవసరం
ప్రతి అర్హుడైన పౌరుడి ఓటు హక్కును పరిరక్షించడం ఎన్నికల వ్యవస్థ ప్రధాన బాధ్యత అని జగన్ పేర్కొన్నారు. ఎన్నికల సంఘంపై అనుమానాలకు తావులేకుండా వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు.
ఒకవైపు కమిషనర్ల అభ్యంతరాలపై మీడియా కథనాలు, మరోవైపు తుది నిర్ణయాలు ఏకగ్రీవమేనన్న ఎన్నికల సంఘం వివరణ నేపథ్యంలో.. ఓటర్ల జాబితాల నిర్వహణ, నిర్ణయాల ప్రక్రియపై మరింత సమాచారం వెలువడుతుందా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

