ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై రాజకీయ వేడి మరింత పెరిగింది. వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఘాటు విమర్శలు గుప్పించారు.
చంద్రబాబు ప్రతిపాదిస్తున్న అమరావతి రాజధాని ప్రాజెక్ట్ 30 నుంచి 40 ఏళ్లు గడిచినా పూర్తి కావడం అసాధ్యమని సజ్జల వ్యాఖ్యానించారు. దీనికి ఉదాహరణగా ఆయన నవ రాయ్‌పూర్ ను ప్రస్తావిస్తూ, “అక్కడ బిల్డింగ్స్ ఉన్నా, ప్రజలు లేరు” అంటూ విమర్శించారు.
అమరావతి నిర్మాణానికి ₹2–3 లక్షల కోట్లు అవసరమవుతాయని, కానీ ప్రస్తుతం నిర్మాణాలు ప్రజల కోసం కాకుండా అధికార వర్గాల కోసం మాత్రమే జరుగుతున్నాయని ఆరోపించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్ అధికారులు, న్యాయమూర్తులకు బంగ్లాలు నిర్మిస్తున్నారని, రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు ఇంకా అభివృద్ధి కాలేదని అన్నారు.
“సదుపాయాలు లేని చోట కోట్ల రూపాయలు పెట్టి ప్రజలు ఎలా వస్తారు? భారీ రేట్లు పెడితే ఎవరు అక్కడ నివసిస్తారు? ప్రజలు లేకుండా లైవ్ సిటీ ఎలా అవుతుంది?” అంటూ సజ్జల ప్రశ్నించారు.
ఇక వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రతిపాదించిన “మావిగన్” మోడల్‌ను ఆయన సమర్థిస్తూ, తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో రాజధాని సాధ్యమవుతుందని చెప్పారు. ఇప్పటికే మౌలిక సదుపాయాలు ఉన్న ప్రాంతాన్ని ఎంపిక చేస్తే త్వరగా అభివృద్ధి సాధ్యమని వివరించారు.
చంద్రబాబు ప్రజలను భ్రమలో పెడుతున్నారని, అమరావతిపై వాస్తవ పరిస్థితులు చెప్పకుండా కల్పిత దృశ్యాలు చూపుతున్నారని సజ్జల ఆరోపించారు. “అప్పులు తీసుకుని భారీ ప్రాజెక్టులు చేపడితే, ఆదాయం ఎలా వస్తుందో చెప్పాలి” అని డిమాండ్ చేశారు.
అమరావతిని అవినీతికి కేంద్రంగా మార్చారని ఆరోపిస్తూ, “ఇది అభివృద్ధి కాదు, కొందరి ఆర్థిక ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రాజెక్ట్” అని తీవ్ర విమర్శలు చేశారు.
మావిగన్ ఆలోచనకు ప్రజల మద్దతు పెరుగుతోందని, అదే కారణంగా చంద్రబాబు అసహనం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. “మావిగన్ పేరు వినగానే భయం మొదలైంది” అంటూ ఎద్దేవా చేశారు.
మరోవైపు మీడియా వ్యాఖ్యలపై జరిగిన వివాదాలపై కూడా స్పందించిన సజ్జల, తమ పార్టీ నాయకుల నిరసనలు ధర్మాగ్రహమని పేర్కొన్నారు. కొన్ని మీడియా సంస్థల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, వాటిని సమర్థించడం మరింత దురదృష్టకరమని అన్నారు.
రాజధాని అంశం రాజకీయంగా మరింత ముదురుతున్న వేళ, అమరావతి vs మావిగన్ చర్చ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ అజెండాగా మారింది.

