అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరిగింది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. ఒకప్పుడు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించిన వైఎస్సార్ వారసుడిగా చెప్పుకునే జగన్, ఇప్పుడు అదే పార్టీకి “దత్తపుత్రుడు”గా మారిపోయాడని షర్మిల ఘాటుగా విమర్శించారు.
మూడు రాజధానుల పేరిట ప్రజలను మభ్యపెట్టి, రుషికొండ వంటి ప్రాంతాలను దోచుకుని, వ్యక్తిగత ఆస్తుల కోసం ప్యాలెస్‌లు నిర్మించుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. చివరకు ప్రజల ముందు “మావిగన్ జోకర్”గా జగన్ మిగిలిపోయారని సెటైర్లు పేల్చారు.
షర్మిల మాట్లాడుతూ, సంక్షేమానికి అసలైన ప్రతీక దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అని స్పష్టం చేశారు. ఆయన చేపట్టిన ప్రతి పథకం ప్రజల కష్టం, కన్నీళ్ల నుంచి పుట్టిందని గుర్తుచేశారు.
అదే సమయంలో జగన్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు:
వైఎస్సార్ వారసుడినని చెప్పుకునే జగన్, ఆయన ఆశయాలను ఎందుకు అమలు చేయలేకపోయారు? సీఎం అయిన తర్వాత కూడా జలయజ్ఞం పూర్తి చేయకపోవడానికి కారణమేంటి? పూర్తి మద్యపాన నిషేధం అంటూ ఇచ్చిన హామీ ఏమైంది? ఎందుకు కల్తీ మద్యం, క్యాష్ మాఫియా పెరిగింది?
2003లో వైఎస్సార్ చేపట్టిన 1457 కిలోమీటర్ల ప్రజాప్రస్థానం ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఉందని షర్మిల పేర్కొన్నారు. కానీ ఆ ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత ఉన్న జగన్ మాత్రం వాటిని విస్మరించారని తీవ్ర విమర్శలు చేశారు.
రాజకీయ వర్గాల్లో షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి.

