తెలంగాణలో లొంగిపోయిన 214 మంది మావోయిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5.59 కోట్ల నగదు రివార్డులు అందించింది. లొంగుబాటు, పునరావాస కార్యక్రమంలో భాగంగా అర్హులైన వారికి నగదు ప్రోత్సాహకాలతో పాటు ఆరోగ్య రక్షణ కార్డులు, ఇళ్ల స్థలాలు కూడా కల్పిస్తున్నారు.
824 మంది జనజీవన స్రవంతిలోకి
2024 జనవరి 1 నుంచి ఇప్పటివరకు తెలంగాణలో 824 మంది మావోయిస్టులు ఆయుధాలు వీడి పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారిలో 755 మందికి రూ.22.31 కోట్లకు పైగా రివార్డులు మంజూరయ్యాయి. 659 మందికి ఇప్పటివరకు రూ.17.68 కోట్లకు పైగా చెల్లించారు. మిగిలిన 96 మందికి ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు అందిన తర్వాత నగదు అందజేయనున్నారు.
లొంగిపోయిన తెలంగాణకు చెందిన 57 మందికి నిమ్స్‌లో నగదు రహిత వైద్యం పొందేందుకు ఆరోగ్య రక్షణ కార్డులు ఇచ్చారు. మరో ఇద్దరికి ఆధార్ కార్డులు వచ్చిన తర్వాత ఆరోగ్య కార్డులు అందించనున్నారు. రాష్ట్రానికి చెందిన 59 మందిలో 10 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించగా, మిగిలిన 49 మందికి కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన 765 మందికి అదనపు పునరావాస సదుపాయాలపై ఆయా రాష్ట్రాలతో సమన్వయం చేస్తున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
కర్రెగుట్టల్లో ఆయుధాల స్వాధీనం
తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల ప్రాంతంలో గుర్తించిన తొమ్మిది ఆయుధ డంపుల నుంచి పోలీసులు 252 తుపాకులు, 359 బీజీఎల్ షెల్స్ స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 48 ఏకే-47 రైఫిళ్లు, 37 ఇన్సాస్ రైఫిళ్లు, 37 ఎస్ఎల్ఆర్లు, నాలుగు ఎల్ఎంజీలు, 25 .303 రైఫిళ్లు ఉన్నాయని వెల్లడించారు.
కర్రెగుట్టల్లో మందుపాతరలు ఉండే ప్రమాదం ఉందని, ముఖ్యంగా ప్రెషర్ మైన్స్ స్థానాలపై స్పష్టమైన సమాచారం లేదని ఆనంద్ తెలిపారు. మందుపాతరల ముప్పును తొలగించి, అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేసిన తర్వాతే పర్యాటకులను అనుమతిస్తామని చెప్పారు.
ముగ్గురు సీనియర్ నేతలకు విజ్ఞప్తి
ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతితో పాటు అజ్ఞాతంలో ఉన్న మరో ఇద్దరు సీనియర్ మావోయిస్టు నేతలు కూడా సాయుధ పోరాటాన్ని విరమించి జనజీవన స్రవంతిలోకి రావాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. లొంగుబాటు, పునరావాస విధానం కింద వారికి ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రయోజనాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

