లోవీ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన ఆసియా పవర్ ఇండెక్స్ 2026లో భారత్ ఆసియాలో మూడో అత్యంత శక్తివంతమైన దేశంగా నిలిచింది. చైనా అధినేత షీ జిన్‌పింగ్ తర్వాత, ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాంతంలో రెండో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు.
చైనాతో అంతరం తగ్గిన భారత్
ఇండెక్స్ ప్రారంభమైన 2018 నుంచి చైనాతో భారత్‌కు ఉన్న శక్తి అంతరం అత్యల్ప స్థాయికి చేరిందని నివేదిక తెలిపింది. అయినప్పటికీ చైనా మొత్తం స్కోరు భారత్ కంటే 80 శాతం ఎక్కువగా ఉంది. బలమైన ఆర్థిక అంచనాలు, దౌత్య ప్రభావం, మోదీ నాయకత్వం భారత్ స్థానానికి తోడ్పడ్డాయని నివేదిక పేర్కొంది.
అంచనాకు ఉపయోగించిన ఎనిమిది విభాగాల్లో ఐదింటిలో భారత్ వృద్ధి సాధించగా, మూడింటిలో స్వల్ప తగ్గుదల నమోదైంది. దౌత్య ప్రభావం మాత్రం స్థిరంగా ఉందని నివేదిక పేర్కొంది. రక్షణ ఒప్పందాలు, ఆగ్నేయాసియా దేశాలకు బ్రహ్మోస్ క్షిపణుల విక్రయాలు భారత రక్షణ సంబంధాల బలాన్ని చూపాయని, ఈ అంశంలో భారత్ తొమ్మిదో స్థానంలో నిలిచిందని తెలిపింది.
సాంస్కృతిక ప్రభావానికి సంబంధించిన స్కోరు 43.8 పాయింట్లకు పెరిగింది. సాంస్కృతిక ప్రచారం, సమాచార వ్యాప్తి, ప్రజల మధ్య రాకపోకల్లో వచ్చిన మెరుగుదల ఇందుకు కారణమని లోవీ ఇన్స్టిట్యూట్ వివరించింది. మరోవైపు రూపాయి బలహీనత, అంతర్జాతీయ ద్రవ్య నిధి నిబంధనల్లో మార్పు, విదేశాలకు వెళ్లే పెట్టుబడుల్లో సుమారు 20 బిలియన్ డాలర్ల తగ్గుదల ప్రతికూల అంశాలుగా ప్రస్తావించింది.
అమెరికా-చైనా మధ్య అంతరం కూడా తగ్గింపు
ఇండెక్స్‌లో అమెరికా 78.9 పాయింట్లు, చైనా 73.6 పాయింట్లు సాధించాయి. ఈ రెండు దేశాల మధ్య తేడా 5.3 పాయింట్లుగా నమోదైంది. ఆర్థిక, సైనిక సామర్థ్యం, రక్షణ వ్యవస్థలు, దౌత్య ప్రభావం వంటి విభాగాల్లో అమెరికా శక్తి తగ్గుతుండగా, చైనా స్థిరంగా ఉందని నివేదిక పేర్కొంది.
ఆసియా పవర్ ఇండెక్స్ 2026లో 27 దేశాలను ఎనిమిది విభాగాలు, 131 సూచికల ఆధారంగా అంచనా వేశారు. ఆర్థిక, సైనిక సామర్థ్యంతో పాటు దౌత్య ప్రభావం, భవిష్యత్తు వనరులు, రక్షణ నెట్‌వర్క్‌లు, ఆర్థిక సంబంధాలు వంటి అంశాలు ఈ కొలమానాల్లో ఉన్నాయి.

