ఖమ్మం జిల్లాలో బైక్పై విధులకు వెళ్తున్న శ్రీరామినేని ఫణికళ (39)ను టిప్పర్ ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. గురువారం ఇంటి నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఇందిరమ్మ కాలనీ సమీపంలో ప్రమాదం జరిగింది.
కుమార్తెతో కలిసి సోమవరంలో నివాసం
వైరాకు చెందిన ఫణికళ తన కుమార్తె మోహన జ్ఞానదీక్షతో కలిసి సోమవరం గ్రామంలో ఉంటున్నారు. ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రజా సంబంధాల అధికారిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు.
ఫణికళ తొమ్మిదేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయి కుమార్తె బాధ్యతను ఒంటరిగా చూసుకుంటున్నారు. చిన్నతనంలోనే తండ్రిని రోడ్డు ప్రమాదంలో కోల్పోయిన ఆమెకు, రెండేళ్ల క్రితం తల్లి కూడా మరణించారు. కుమార్తెకు మంచి చదువు చెప్పించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆమె ఆశించారు.
తల్లి మృతితో కుమార్తె తీవ్రంగా విలపించింది. ఫణికళ మృతితో సోమవరం గ్రామంలో విషాదం నెలకొంది.

