ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు కీలక శుభవార్త ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో గరిష్ఠ వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు భారీ ఊరట లభించనుంది.
ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ పరిపాలన శాఖ జీఓ ఎంఎస్ నంబర్ 187ను విడుదల చేసింది. నాన్-యూనిఫామ్ సర్వీస్ పోస్టులన్నింటికీ ఈ వయోపరిమితి సడలింపు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ సడలింపు 2027 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఏపీపీఎస్సీతో పాటు ఇతర రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల ద్వారా చేపట్టే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కు ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి.
గతంలో ఉన్న 42 ఏళ్ల గరిష్ఠ వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ తుది నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. అయితే ఈ పెంపు అన్ని ఉద్యోగాలకు వర్తించదు.
పోలీస్, ఎక్సైజ్, ఫైర్, ఫారెస్ట్, ట్రాన్స్‌పోర్ట్ వంటి యూనిఫామ్ సర్వీసుల పోస్టులకు ఈ వయోపరిమితి పెంపు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అదే సమయంలో రూల్ నంబర్ 12 ప్రకారం అందుబాటులో ఉన్న ఇతర అదనపు వయోపరిమితి సడలింపులు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. మొత్తంగా.. నాన్-యూనిఫామ్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఏపీ నిరుద్యోగులకు ఈ నిర్ణయం కీలక అవకాశంగా మారనుంది.

