ప్రియుడు ఫోన్ చేయడం లేదని, తాను కాల్ చేసినా స్పందించడం లేదనే బాధతో ఇద్దరు పిల్లల తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన బాగలకోటలోని బాంబే కాలనీలో చోటుచేసుకుంది. మొబైల్ సంబంధాల కారణంగా కుటుంబ బంధాలు దెబ్బతింటున్నాయనే చర్చకు ఈ ఘటన మరోసారి కారణమైంది.
మృతురాలిని మెహబూబ్ బీ (27)గా గుర్తించారు. ఆమెకు స్థానికంగా ఉంటున్న ఓ యువకుడితో సంబంధం ఉన్నట్లు సమాచారం. అయితే కొన్నిరోజులుగా ఆ యువకుడు ఆమెకు ఫోన్ చేయకపోవడంతో పాటు, ఆమె ఫోన్ చేసినా స్పందించలేదని తెలిసింది.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మెహబూబ్ బీ.. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు సెల్ఫీ వీడియో తీసి ఆ యువకుడికి పంపినట్లు సమాచారం. అంతేకాకుండా తనతో మాట్లాడకపోతే అతని పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటానని వాట్సాప్ ద్వారా సందేశం కూడా పంపినట్లు తెలుస్తోంది.
అయినప్పటికీ అతడు స్పందించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మెహబూబ్ బీ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై నవనగర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

