విజయవాడలో సంచలనం సృష్టించిన పేరిపోగు క్రాంతికుమార్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మొదట ఆత్మహత్య కేసుగా నమోదైన ఈ వ్యవహారాన్ని పోలీసులు ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కిందకు మార్చడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో కృష్ణలంక మాజీ సీఐ నాగరాజుపై రెండో కేసు నమోదవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
క్రాంతికుమార్ మే 21న ఆత్మహత్యకు పాల్పడే ముందు, తన మరణానికి మాజీ సీఐ నాగరాజే కారణమని ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగింది. దళిత సంఘాలు కూడా ఈ ఘటనపై ఆందోళనలు చేపట్టి సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశాయి.
ఈ నేపథ్యంలో విజయవాడ పోలీస్ కమిషనర్ ఆదేశాలతో ఉత్తర మండలం ఏసీపీ పి. సత్యానందం విచారణ చేపట్టారు. విచారణలో సేకరించిన వివరాల ఆధారంగా కేసును ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కిందకు మార్చినట్లు పోలీసులు కోర్టుకు మెమో సమర్పించారు.
మరోవైపు, క్రాంతికుమార్ ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను దర్యాప్తు అధికారులు ఆయన తండ్రి వెంకటేశ్వరరావు నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్‌ను ఇప్పటికే విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో సమర్పించారు. ఇప్పుడు ఫోన్‌లోని డిజిటల్ ఆధారాలను సేకరించేందుకు రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్‌ఎస్ఎల్)కు పంపేందుకు అనుమతి కోరుతూ పోలీసులు కోర్టులో మెమో దాఖలు చేశారు.
గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో పోలీసుల వ్యవహారశైలిపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్న వేళ, క్రాంతికుమార్ కేసులో అట్రాసిటీ చట్టం వర్తింపజేయడం మరో కీలక పరిణామంగా మారింది. ఫోరెన్సిక్ నివేదిక వెలువడిన తర్వాత ఈ కేసు దర్యాప్తు మరింత కీలక మలుపు తిరిగే అవకాశం ఉందని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి.

