అమరావతి: గాదె సాయి కృష్ణ అదృశ్యం ఘటనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీఐ నాగరాజును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అలాగే ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది.
సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లతో కలిసి ఈ అంశంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశానికి డీజీపీ, అదనపు డీజీపీతో పాటు ఇంటెలిజెన్స్ డీజీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయి కృష్ణ అదృశ్యానికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి సేకరించినట్లు సమాచారం.
గత కొన్ని రోజులుగా గాదె సాయి కృష్ణను మార్కాపురం ప్రాంతం నుంచి కృష్ణలంక పోలీసులు సీఐ నాగరాజు ఆధ్వర్యంలో తీసుకెళ్లారని, అనంతరం అతడికి లాకప్ డెత్ జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుమారుడు సజీవంగా ఉంటే అప్పగించాలని, లేకపోతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు నిరసనలు చేపడుతున్నారు.
ఈ నేపథ్యంలో డీజీపీ నుంచి పూర్తి నివేదిక కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఘటనపై వాస్తవాలు వెలికితీయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆరోపణల నేపథ్యంలో సీఐ నాగరాజును విఆర్‌కు పంపినట్లు డీజీపీ ప్రభుత్వానికి వివరించినట్లు తెలుస్తోంది. అనంతరం ఆయనపై సస్పెన్షన్ వేటు వేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు సమాచారం.
అదృశ్యమైన సాయి కృష్ణ ఆచూకీపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు, కేసులో ఉన్న అన్ని కోణాలను సమగ్రంగా విచారించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. విచారణ అనంతరం వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

