ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ హయాంలో ఎన్నో అక్రమాలు, అరాచకాలు జరిగాయని ఆరోపించిన ఆమె, దళిత వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రకాశం జిల్లా కనిగిరిలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అనిత మాట్లాడుతూ, “జగన్ అండ్ కో చేసిన దాష్టీకాలను ప్రజలు మరచిపోవద్దు” అని వ్యాఖ్యానించారు. తనతో పాటు ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై కూడా అట్రాసిటీ కేసులు నమోదు చేశారని, ఇప్పటికీ ఆ కేసుల కోసం కడప కోర్టుకు తిరగాల్సి వస్తోందని వెల్లడించారు.
దళితుల హక్కుల కోసం పోరాడిన మహానేత అంబేడ్కర్ భావజాలం ప్రతి ఒక్కరిలో ఉండాలని అనిత పేర్కొన్నారు. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం దళిత సమాజంలోనే విభేదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌ను ప్రశంసించిన ఆమె, ఆయన తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ దళిత సమాజానికి చేసిన సేవలను గుర్తుచేశారు. చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన చిరాగ్ పాశ్వాన్, ప్రధాని నరేంద్ర మోదీకి హనుమంతుడిలా అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
అంబేడ్కర్ విగ్రహాలను గ్రామాల చివర కాకుండా ప్రజల మధ్య ఏర్పాటు చేయాలని సూచించిన అనిత, కనిగిరి పట్టణ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
అలాగే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రను ప్రస్తావిస్తూ, “రెడ్‌బుక్ గురించే మాట్లాడేవారు.. లోకేశ్ చేతిలో ఉన్న రాజ్యాంగం కనిపించలేదా?” అంటూ ప్రతిపక్షాలపై కూడా విమర్శలు చేశారు.
హోంమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. జగన్ పాలనపై అనిత చేసిన ఆరోపణలకు వైసీపీ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

