ఇటలీలో కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ చిన్ననాటి ఇల్లు మ్యూజియంగా మారనుంది. ఆ ఇంటిని 2020లో కొనుగోలు చేసిన పంజాబ్‌కు చెందిన వ్యాపారవేత్త సుఖ్‌దేవ్ సింగ్ కాంగ్, మ్యూజియంగా అభివృద్ధి చేయాలని ప్రణాళిక వేస్తున్నారు.
లూసియానాలోని ఆరు గదుల ఇల్లు
విసెంజా ప్రావిన్స్‌లోని లూసియానాలో ఈ ఇల్లు ఉంది. గ్రే స్టోన్, కాంక్రీటుతో నిర్మించిన ఇందులో ఆరు గదులున్నాయని కాంగ్ తెలిపారు. సోనియా గాంధీ 1946 డిసెంబర్ 9న ఇక్కడ జన్మించి, బాల్యంలో తొలి రోజులు ఈ ఇంట్లోనే గడిపారని ఆయన చెప్పారు.
హోషియార్పూర్ జిల్లాలోని గ్రామానికి చెందిన కాంగ్ 1992లో ఇటలీకి వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. తన భార్య, కుమార్తె పేర్ల మీద 2020లో ఇంటిని కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఇంటి సంరక్షణకు కేర్‌టేకర్‌ను నియమించామని, చూడటానికి వచ్చే పర్యాటకులకు ఆయన సహాయం చేస్తారని తెలిపారు. ఆస్తి పన్నుతో సహా నిర్వహణ కోసం ఏడాదికి సుమారు 1,000 యూరోలు ఖర్చవుతున్నట్లు కాంగ్ పేర్కొన్నారు.
మ్యూజియం కోసం జ్ఞాపికల సేకరణ
ఈ ఇంటిని అద్దెకు ఇవ్వాలన్న, గురుద్వారాగా మార్చాలన్న ప్రతిపాదనలను తమ కుటుంబం తిరస్కరించిందని కాంగ్ చెప్పారు. సోనియా గాంధీ, మైనో కుటుంబంతో ఇంటికి ఉన్న అనుబంధాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
ప్రతిపాదిత మ్యూజియంలో ప్రదర్శించడానికి వ్యక్తిగత వస్తువులు, ఫొటోలు, పత్రాలు, ఇతర జ్ఞాపికలు అవసరమని కాంగ్ తెలిపారు. ఇందుకోసం సోనియా గాంధీతో పాటు రాహుల్, ప్రియాంకలను కలసి కుటుంబానికి సంబంధించిన వస్తువులు లేదా సమాచారాన్ని కోరాలని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అవసరమైన జ్ఞాపికలు అందుబాటులో లేకపోవడం మ్యూజియం ప్రణాళికకు ఆటంకంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
మ్యూజియం ఏర్పాటైతే ఇటలీకి వెళ్లే భారతీయులకు మరో సందర్శనా స్థలం అందుబాటులోకి వస్తుందని కాంగ్ ఆశిస్తున్నారు. అది పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత సందర్శకులను ఆకర్షించి, స్థానిక గ్రామ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తన భార్య, కుమార్తె కూడా ఈ ఆలోచనకు మద్దతిస్తున్నారని తెలిపారు.

