హైదరాబాద్: సింగర్ మంగ్లీపై నమోదైన చీటింగ్ కేసులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. తనపై ఆరోపణలు చేస్తున్న న్యాయవాది సుబ్బారావుపై మంగ్లీ నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
మంగ్లీ ఇచ్చిన ఫిర్యాదులో, సుబ్బారావు తనపై రూ.10 కోట్ల మోసం ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. గత నెల 21న తనతో పరిచయం చేసుకున్న సుబ్బారావు అమర్యాదగా ప్రవర్తించారని, తనను కలవాలని ఒత్తిడి చేశారని తెలిపారు. తాను నిరాకరించడంతో నోట్ల కట్టల వీడియో చూపించి బెదిరించారని ఆరోపించారు. ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు.
మంగ్లీ ఫిర్యాదు మేరకు న్యాయవాది సుబ్బారావుపై బీఎన్‌ఎస్ సెక్షన్లు 79, 351(3) కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదిలా ఉంటే, ఇంతకుముందు సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ మంగ్లీపై తీవ్ర ఆరోపణలు చేశారు. రెండు నెలల క్రితం మంగ్లీ పేరుతో మోసం జరిగిందని బాధితులు తనను సంప్రదించారని తెలిపారు. విచారణలో మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివ, మధు ఈ వ్యవహారంలో ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు.
ముఖ్య నిందితుడు మధు రూ.200 కోట్ల వరకు పెట్టుబడుల పేరుతో డబ్బులు సేకరించారని, భారీ లాభాలు ఇస్తామని చెప్పి బాధితులను మోసం చేశారని ఆరోపించారు. పెట్టుబడులు తిరిగి రాకపోవడంతో బాధితులు తనను ఆశ్రయించారని తెలిపారు. అంతేకాకుండా కేంద్ర మంత్రి, ఎమ్మెల్యే పేర్లు చెప్పి తనను బెదిరించారని కూడా ఆరోపించారు.
ఇక సింగర్ మంగ్లీపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కూడా కేసు నమోదైంది. మైక్రో ఫైనాన్స్ పేరిట రూ.10 కోట్లు మోసం చేశారని, తనకు ప్రాణహాని ఉందని సుబ్బారావు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మంగ్లీతో పాటు ఆమె సోదరుడు మరియు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతం ఈ కేసు రెండు వైపులా ఆరోపణలు, ప్రతియారోపణలతో ఆసక్తికరంగా మారింది. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

