జర్మనీలో 450కి పైగా పాఠశాలలకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. సోమవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ సందేశాల్లో “మరణం మీ కోసం ఎదురుచూస్తోంది” అని రాసి ఉన్నట్లు సమాచారం.
పాఠశాలల్లో తనిఖీలు
బెర్లిన్‌తో పాటు బాడెన్-వుర్టెంబర్గ్, తురింగియా, సాక్సోనీ-అన్హాల్ట్, రైన్లాండ్-పాలటినేట్ రాష్ట్రాల్లోని పాఠశాలలకు ఇలాంటి ఈమెయిల్స్ అందాయి. భవనాల్లో పేలుడు పదార్థాలు అమర్చామని, వాటిని పేల్చివేస్తామని సందేశాల్లో హెచ్చరించినట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు బెదిరింపులు వచ్చిన పాఠశాలల్లో తనిఖీలు చేపట్టారు. ముందు జాగ్రత్తగా కొన్ని పాఠశాలలను ఖాళీ చేయించారు. తనిఖీల్లో అనుమానాస్పద వస్తువులేవీ కనిపించలేదని, పాఠశాలలకు తక్షణ ప్రమాదం ఉన్నట్లు ఆధారాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు.
బెదిరింపులపై దర్యాప్తు
ఈమెయిల్స్‌ను ఎవరు పంపించారు, వాటి వెనుక వ్యక్తులు లేదా సంస్థలు ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డెన్మార్క్‌లోని కొన్ని పాఠశాలలకు కూడా బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, హంగరీ, సెర్బియాలోని పాఠశాలలకూ గత కొన్ని వారాల్లో ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.

