ఈజిప్టు రాజధాని కైరోలోని రింగ్ రోడ్డుపై ఇంధన ట్యాంకర్ బోల్తా పడి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 31 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 21 మంది గాయపడ్డారు.
వాహనాలకు వ్యాపించిన మంటలు
గ్రేటర్ కైరో పరిధిలోని గిజా గవర్నరేట్, ఇంబబాలో అల్-వర్రాక్ ప్రాంతంలోని టన్నెల్ 10 సమీపంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ట్యాంకర్ బోల్తా పడిన తర్వాత మంటలు చెలరేగి సమీపంలోని వాహనాలకు వ్యాపించాయి. రెండు డజన్లకు పైగా కార్లు, మోటార్ సైకిళ్లు దగ్ధమైనట్లు వివరాలు వెల్లడించాయి.
గాయపడిన వారికి చికిత్స
ఈజిప్టు ఆరోగ్య శాఖ మంత్రి ఖలీద్ అబ్దెల్ గఫార్ ప్రకటించిన తుది వివరాల ప్రకారం, ప్రమాదంలో 31 మంది మరణించారు, 21 మంది గాయపడ్డారు. సహాయక చర్యల కోసం 39 అంబులెన్స్‌లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించగా, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
బాధితుల గుర్తింపునకు డీఎన్ఏ పరీక్షలు
మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం తెలిపింది. ప్రమాదంపై ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్-ఫత్తా ఎల్-సిసి సంతాపం వ్యక్తం చేశారు.

