హైదరాబాద్ నుంచి వారణాసి, ప్రయాగ్రాజ్, అయోధ్య, లక్నో, నైమిశారణ్య ప్రాంతాలను సందర్శించేలా IRCTC గంగా రామాయణ యాత్ర ప్యాకేజీని ప్రకటించింది. విమాన ప్రయాణంతో సాగే ఈ టూర్ ఐదు రాత్రులు, ఆరు రోజుల పాటు ఉంటుంది. ప్యాకేజీ కోడ్ SHA10.
ప్రయాణ తేదీలు, సందర్శన ప్రదేశాలు
ఈ యాత్రకు 2026 డిసెంబర్ 16, 2027 ఫిబ్రవరి 20 తేదీలను ప్రకటించారు. మొదటి రోజు హైదరాబాద్ నుంచి వారణాసికి ప్రయాణం ఉంటుంది. అక్కడ కాశీ విశ్వనాథ ఆలయం, గంగా ఘాట్ల సందర్శన షెడ్యూల్లో ఉన్నాయి. రెండో రోజు సారనాథ్, బిర్లా ఆలయాన్ని సందర్శిస్తారు.
మూడో రోజు ప్రయాగ్రాజ్లోని అలోపీ దేవి ఆలయం, త్రివేణి సంగమం సందర్శన తర్వాత అయోధ్యకు వెళ్తారు. నాలుగో రోజు అయోధ్య ఆలయ సందర్శన అనంతరం లక్నోకు ప్రయాణం ఉంటుంది. ఐదో రోజు నైమిశారణ్య క్షేత్రాన్ని సందర్శించి లక్నోకు తిరిగి చేరుకుంటారు. చివరి రోజు బడా ఇమాంబారాను చూసిన తర్వాత లక్నో విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం ఉంటుంది.
ప్యాకేజీ ధరలు
2026 డిసెంబర్ యాత్రలో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.46,050, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.36,100, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.34,300 ధరగా పేర్కొన్నారు. 2027 ఫిబ్రవరి యాత్రకు ఈ ధరలు వరుసగా రూ.47,100, రూ.36,400, రూ.34,700. పిల్లలకు వయసును బట్టి ప్రత్యేక ధరలు వర్తిస్తాయి.
ధరలో చేర్చిన సేవలు
విమాన టికెట్లు, హోటల్ వసతి, ఐదు అల్పాహారాలు, ఐదు రాత్రి భోజనాలు, ఒక మధ్యాహ్న భోజనం, స్థానిక సందర్శనలకు ఏసీ బస్సు, ప్రయాణ బీమా, టూర్ ఎస్కార్ట్ సేవలు ప్యాకేజీలో ఉన్నాయి. ప్రత్యేక ఆలయ పూజలు, గైడ్ సేవలు, అదనపు భోజనం, వ్యక్తిగత ఖర్చులు ధరలో చేర్చలేదు. ఈ టూర్కు 29 సీట్లు అందుబాటులో ఉన్నట్లు వివరించారు.

