రాజన్న సిరిసిల్ల జిల్లాలో బైక్‌ను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. మృతుల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద అటెండర్‌గా పనిచేసిన మణికుమార్‌రెడ్డి, భరత్ ఉన్నారు.
బంధనకల్ సమీపంలో ప్రమాదం
ముస్తాబాద్ మండలం బంధనకల్ గ్రామ సమీపంలోని హనుమాన్ నగర్ చౌరస్తా వద్ద రాత్రి ఈ ప్రమాదం జరిగింది. వెంకయ్యకుంట సమీపంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరినీ వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన మణికుమార్‌రెడ్డి అక్కడికక్కడే మరణించారు. గాయపడిన భరత్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అర్ధరాత్రి దాటిన తర్వాత మరణించారు.
కుటుంబానికి అండగా ఉంటామని కేసీఆర్ హామీ
మణికుమార్‌రెడ్డి మరణవార్త తెలుసుకున్న కేసీఆర్ ముస్తాబాద్ మాజీ ఎంపీపీ జనగామ శరత్‌రావుకు ఫోన్ చేసి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. మణికుమార్ కుటుంబానికి సహాయం చేస్తామని భరోసా ఇచ్చారు. కేసీఆర్, ఆయన సతీమణి శోభ తమ కుటుంబంలో ఒకరిగా మెలిగిన మణికుమార్ మరణం బాధించిందని సంతాపం తెలిపారు. మాజీ మంత్రి కేటీఆర్, ఆయన సతీమణి శైలిమ కూడా సంతాపం వ్యక్తం చేశారు.
మణికుమార్‌రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సిరిసిల్ల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.

