కడప జిల్లాలోని కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కమలాపురం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యే
వీరశివారెడ్డి కమలాపురం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1994, 2004 ఎన్నికల్లో టీడీపీ తరఫున విజయం సాధించగా, 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. 1999లో టీడీపీ తరఫున పోటీ చేసిన ఆయన ఓడిపోయారు.
ఎన్నికల సమయంలో పార్టీ మార్పులు
2019 ఎన్నికలకు ముందు కమలాపురం టికెట్ ఆశించి టీడీపీలో చేరిన వీరశివారెడ్డికి ఆ పార్టీ నుంచి అవకాశం దక్కలేదు. అనంతరం వైఎస్సార్సీపీలో చేరారు. 2024 ఎన్నికలకు ముందు జనవరిలో మళ్లీ టీడీపీలోకి వెళ్లి కమలాపురం టికెట్ కోసం ప్రయత్నించినా అది లభించలేదు. ఏప్రిల్ 25న పులివెందులలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో తిరిగి వైఎస్సార్సీపీలో చేరారు.
తాజాగా వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఆయన మరోసారి పార్టీ మారారు. వీరశివారెడ్డి చేరికతో కడప జిల్లాలో పార్టీ బలోపేతం అవుతుందని పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు.

