హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో బాంబులు ఉన్నాయంటూ వస్తున్న ఈమెయిళ్ల నేపథ్యంలో నగరమంతా అప్రమత్తం చేశామని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
సైబర్ క్రైమ్ బృందాల దర్యాప్తు
బెదిరింపు మెయిళ్లు పంపుతున్నవారిని గుర్తించేందుకు హైదరాబాద్ సిటీ పోలీసుల సైబర్ క్రైమ్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని సీవీ ఆనంద్ వెల్లడించారు. ఏఐ సాంకేతికతను ఉపయోగించి, తమ స్థానాన్ని గుర్తించకుండా ఈమెయిళ్లు పంపుతున్నట్లు దర్యాప్తులో గుర్తించామని ఆయన చెప్పారు. నిందితులను త్వరలో గుర్తిస్తామని తెలిపారు.
ప్రజలు భయపడొద్దని విజ్ఞప్తి
బాంబు ఉందంటూ విమానానికి తప్పుడు సమాచారం అందితే, విమానాన్ని వెనక్కి తీసుకురావడం, ప్రయాణికులను ఖాళీ చేయించడం వంటి చర్యలు తప్పవని సీవీ ఆనంద్ వివరించారు. బెదిరింపులతో ప్రజలను, అధికార యంత్రాంగాన్ని ఇబ్బంది పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు భయాందోళనలకు గురికావద్దని కోరారు.

